అజిత్ సంస్థకు రక్షణ డ్రోన్ల తయారీ ప్రాజెక్టు
ABN , First Publish Date - 2023-08-10T02:27:28+05:30 IST
తమిళ అగ్రహీరో అజిత్ కుమార్ నేతృత్వంలోని ‘దక్ష’ సంస్థ భారత రక్షణశాఖకు అవసరమైన డ్రోన్ల తయారీ ప్రాజెక్టును సొంతం చేసుకుంది.
చెన్నై, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తమిళ అగ్రహీరో అజిత్ కుమార్ నేతృత్వంలోని ‘దక్ష’ సంస్థ భారత రక్షణశాఖకు అవసరమైన డ్రోన్ల తయారీ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. భారత సైన్యానికి 200 డ్రోన్లు తయారుచేసి ఇచ్చే ఆర్డర్‌ను ఈ సంస్థ దక్కించుకుంది. దీనికోసం రక్షణశాఖ రూ.165 కోట్లు కూడా కేటాయించింది. దక్ష తయారుచేసిన డ్రోన్లను కొన్ని నెలల్లో భారత సైన్యానికి అప్పగించనున్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి నిఘాతోపాటు.. ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయక చర్యల కోసం ఈ డ్రోన్లను వినియోగిస్తారని తెలిసింది. అజిత్ సినిమాల్లోనే కాకుండా బైక్, కార్ రేస్, ఫోటోగ్రఫీ, రైఫిల్ షూటింగ్ వంటి పోటీల్లో కూడా రాణిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. డ్రోన్ తయారీలోనూ ఆయనకు మంచి పరిజ్ఞానం ఉంది. గతంలో ఒక చిన్న తరహా డ్రోన్‌ను కూడా తయారు చేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన చెన్నై ఎంఐటీ విద్యార్థులు కొందరు అజిత్ నేతృత్వంలో ఒక బృందంగా ఏర్పడ్డారు. తమ టీమ్‌కు‘దక్ష’ అని పేరు పెట్టుకున్నారు. కరోనా సమయంలో ఈ బృందం తయారుచేసిన డ్రోన్‌లు అందరినీ ఆకర్షించాయి.