అదానీపై ఆగని రచ్చ

ABN , First Publish Date - 2023-02-07T03:21:49+05:30 IST

అదానీ గ్రూపు వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అదానీ స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంపై తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను సభాపతులు ఆమోదించకపోవడంతో ప్రతిపక్షాలు సోమవారం వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో ఉభయ సభలను స్తంభింపచేశాయి.

అదానీపై ఆగని రచ్చ

‘హిండెన్‌బర్గ్‌’ ప్రకంపనలపై చర్చించాల్సిందేనని పార్లమెంటులో విపక్షాల పట్టు

పార్లమెంటులో అదానీపై అదే ప్రతిష్టంభన

చర్చించాలి.. జేపీసీ వేయాల్సిందే: విపక్షాలు

ఉభయ సభలూ నేటికి వాయిదా

ఖర్గే చాంబర్లో విపక్ష నాయకుల భేటీ

ధన్యవాద తీర్మానంపై చర్చకు సిద్ధం

స్కాంపై తొలుత మోదీ స్పందించాలని షరతు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అదానీ గ్రూపు వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అదానీ స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంపై తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను సభాపతులు ఆమోదించకపోవడంతో ప్రతిపక్షాలు సోమవారం వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో ఉభయ సభలను స్తంభింపచేశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగకుండా అడ్డుకున్నాయి. ఫలితంగా రెండు సభలూ మంగళవారానికి వాయిదాపడ్డాయి. ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే కాంగ్రెస్‌, ఇతర విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ‘అదానీ సర్కార్‌ డౌన్‌డౌన్‌’, ‘అదానీ సర్కార్‌ షేమ్‌ షేమ్‌’ అని నినాదాలు చేశారు. అదానీ అక్రమాలపై జేపీసీ లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, నినాదాలు చేయడం పార్లమెంటు హుందాతనానికే మచ్చ అని స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. విపక్షాలు వినిపించుకోకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేశారు.

తిరిగి సమావేశమయ్యాక.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మాట్లాడుతూ.. ప్రైవేటు కంపెనీల వ్యవహారాలను పార్లమెంటులో చర్చించడానికి వీల్లేదని.. కావాలంటే ధన్యవాద తీర్మానంపై చర్చించడం పార్లమెంటరీ సంప్రదాయమని.. దానిని అనుమతించాలని.. చర్చ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరారు. ప్రతిపక్ష సభ్యులు తగ్గకపోవడంతో సభాపతి సభను మంగళవారానికి వాయిదావేశారు. రాజ్యసభ కూడా ముందుకు సాగలేదు. అదానీపై చర్చను చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనుమతించలేదు. విపక్షాలు ఇచ్చిన 10 వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. ఇప్పటికే ఖరారైన అంశాలపై తప్ప ఇతర విషయాలపై చర్చించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ధన్యవాద తీర్మానంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. అయితే అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ జవాబు ఇచ్చేటట్లయితే పార్లమెంటు సజావుగా నడిచేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే స్పష్టం చేశారు. ఇంకోవైపు.. ధన్యవాద తీర్మానంపై మంగళవారం చర్చ జరిపేందుకు విపక్షాలు అంగీకరించినట్లు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. శుక్రవారంలాగే సోమవారం ఉదయం ఖర్గే చాంబర్లో 16 విపక్ష నేతలు హాజరై.. అదానీ వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించేదాకా సభల కార్యకలాపాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత వారు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.

సర్కారు భయపడుతోంది: రాహుల్‌

అదానీ అంశంపై పార్లమెంటులో చర్చకు మోదీ ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఎద్దేవాచేశారు. అందుకే చర్చ జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని మోదీ శాయశక్తులా యత్నిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. అదానీ వెనుక ఉన్న శక్తి ఎవరో దేశానికి తెలియాలని స్పష్టం చేశారు.

మిస్టర్‌ మోదీ పెదవి విప్పండి!

అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వరుసగా రెండో రోజూ నిప్పులు చెరిగింది. ‘‘మిస్టర్‌ పీఎం మౌనం వీడండి. మహా మౌనంతో చెవిటితనం ప్రదర్శిస్తున్నారా? కావాల్సిన వారి లబ్ధి కోసం మన్‌ కీ బాత్‌ మాదిరిగా మన్‌ కీ బ్యాంకింగ్‌ చేస్తున్నారా?’’ అని ఏఐసీసీ కమ్యూనికేషన్స్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ నిలదీశారు. మోదీ మౌనం వీడే వరకు ప్రతి రోజూ మూడు ప్రశ్నలు సంధిస్తామన్న ఆయన తాజాగా సోమవారం ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘అదానీకి మీరేమవుతారు? అదానీ గ్రూపు వంటి రిస్క్‌తో కూడుకున్న కంపెనీకి ఎల్‌ఐసీ నుంచి భారీ ఎత్తున నిధులు ఎలా కేటాయించారు? ఇది పూర్తిగా మీకు కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చేందుకు మీరు చేసిన ‘మన్‌ కీ బ్యాంకింగ్‌’ కాదా?’’ అని జైరాం ప్రశ్నలు సంధించారు. అదానీ గ్రూపు తో లబ్ధి పొందుతున్నవారు ఎవరనేదే ఇక్కడ కీలక ప్రశ్న అని జైరామ్‌ వ్యాఖ్యానించారు.

పేదలపై మోదీ నిశ్శబ్ద దాడి: సోనియా

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను ‘పేదలపై ప్రధాని మోదీ చేసిన నిశ్శబ్ద దాడి’గా అభివర్ణించారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రివర్గానికి ఎంతో ఆప్తుడు అయిన అదానీపై ఆర్థిక కుంభకోణాల ఆరోపణలు పెల్లుబుకుతున్నా.. వాటిపై పెదవి విప్పకుండా.. ‘విశ్వగురు-అమృత్‌ కాల్‌’ అంటూ జపం చేస్తున్నారని సోనియా ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-02-07T03:22:40+05:30 IST