Share News

CWC meeting : 21న సీడబ్ల్యూసీ భేటీ

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:52 AM

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి కారణాలను విశ్లేషించడంతోపాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహరచనపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 21న వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశాన్ని ఏర్పాటు

CWC meeting  : 21న సీడబ్ల్యూసీ భేటీ

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహరచనపై చర్చ?

250 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ కి యోచన

న్యూఢిల్లీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి కారణాలను విశ్లేషించడంతోపాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహరచనపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 21న వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీని ఎదుర్కొనేందుకు సాధ్యమైనంత త్వరగా ప్రణాళికను రూపొందించి ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మిత్రపక్షాలతో సీట్ల పంపిణీ, ప్రచార వ్యూహాలపై వర్కింగ్‌ కమిటీ సభ్యులు చర్చిస్తారు. సాధ్యమైనంత మేరకు బీజేపీతో ముఖాముఖి పోటీ చేసే 190 స్థానాలపైనే కాంగ్రెస్‌ దృష్టి కేంద్రీకరించాలని, మిత్రపక్షాలతో మరో 50-60 సీట్లు ఆశించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ రెండవ విడత జోడోయాత్ర జరిపే అవకాశాలపై కూడా వర్కింగ్‌ కమిటీ చర్చిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడేందుకు దేశంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు కాలినడకతోపాటు వాహనంలోనూ రాహుల్‌ యాత్ర కొనసాగే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, మిజోరంలలో ఎదురైన పరాజయాలపైనా చర్చించనున్నారు. ఈ ఓటమికి కారణాలను విశ్లేషించడం ద్వారా భావి వ్యూహాలను రూపొందించాలని కాంగ్రెస్‌ అఽధిష్ఠానం భావిస్తోంది. తెలంగాణలో పార్టీ విజయాలపై కూడా వర్కింగ్‌ కమిటీలో చర్చ జరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు. కాగా, సీడబ్ల్యూసీ సమావేశానికి రెండు రోజుల ముందే(ఈనెల 19న) ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. కలిసికట్టుగా ఒక ప్రధాన రాజకీయ ఎజెండాను రూపొందించడంతోపాటు సీట్ల పంపిణీ, సంయుక్త ర్యాలీలు నిర్వహించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ‘మై నహీ.. హమ్‌(నేను కాదు.. మనం)’ నినాదంతో ఇండియా కూటమి ప్రజల ముందుకు వెళ్తుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

కనీసం 400 సీట్లలో ఉమ్మడి అభ్యర్థులను గుర్తించాలి

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలవడమే ప్రతిపక్ష ఇండియా కూటమి తక్షణ కర్తవ్యమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. ఆదివారం పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా, ‘గాలి బీజేపీ వైపు ఉంది. కానీ పవనాలు దిశ మార్చుకోగలవు. బీజేపీ ఎన్నికలను లైట్‌గా తీసుకోదు. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే చివరి యుద్ధం అన్నట్టుగా పోరాడుతోంది. ఆ లక్షణాన్ని ప్రతిపక్ష పార్టీలు గ్రహించాలి’ అన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి గురించి ప్రస్తావించగా.. ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలనేది ఎన్నికల తర్వాత కూటమి నేతలు నిర్ణయిస్తారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి సన్నద్ధత గురించి మాట్లాడుతూ కనీసం 400 నుంచి 425 సీట్లలో బీజేపీని ఎదుర్కోగల అభ్యర్థులను గుర్తించడం అత్యంత ముఖ్యమైన అంశమని చిదంబరం చెప్పారు. బీజేపీని ఓడించేందుకు ఆ సీట్లలో ఏకైక ఉమ్మడి అభ్యర్థులను కూటమి బరిలోకి దించాల్సిన అవసరం ఉందన్నారు. ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఊహించని పరిణామమని, ఆందోళనకరమైన విషయమని చిదంబరం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నాటికి బలహీనతలను పార్టీ అధిష్ఠానం పరిష్కరిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 40 శాతం ఓటు బ్యాంకు చెక్కు చెదరనట్టు రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 03:52 AM