Corporation: బడ్జెట్‌పై కార్పొరేషన్‌ కసరత్తు

ABN , First Publish Date - 2023-01-26T09:14:13+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (Greater Chennai Corporation) బడ్జెట్‌ కసరత్తు ప్రారంభమైంది. జీసీసీ మేయర్‌ ప్రియ నేతృత్వంలో

Corporation: బడ్జెట్‌పై కార్పొరేషన్‌ కసరత్తు

- ఈసారి మురిపించే పథకాలు, ఆకర్షించే తాయిలాలు?

చెన్నై, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (Greater Chennai Corporation) బడ్జెట్‌ కసరత్తు ప్రారంభమైంది. జీసీసీ మేయర్‌ ప్రియ నేతృత్వంలో స్టాండింగ్‌ కమిటీ సమావేశమై బడ్జెట్‌ రూపకల్పనకు సన్నాహాలు చేస్తోంది. అంతేగాక కౌన్సిలర్లను పిలిచి మేయర్‌ వేర్వేరుగా చర్చిస్తున్నారు. 2023-24 వార్షిక బడ్జెట్‌ కసరత్తు పూర్తయితే ఫిబ్రవరి నెలాఖరులో మేయర్‌ ప్రవేశపెట్టే అవకాశముంది. బడ్జెట్‌ రూపకల్పన కోసం ఇప్పటికే ఆర్థిక నిపుణులతో భేటీ అయిన మేయర్‌ బుధవారం అన్ని కమిటీలతోనూ సమావేశ మయ్యారు. వార్డుల వారీగా ఆదాయం, ఖర్చుల వివరాలు, ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన కొత్త పథకాలపై పూర్తి వివరాలతో ప్రణాళిక దాఖలుచేయాలని ఆయా మండల కమిటీ అధ్యక్షులకు ఇప్పటికే మేయర్‌ లేఖలు రాశారు. విద్య, వైద్యం, రోడ్డు వసతి, వర్షపు నీటి సేకరణ, ఫ్లై ఓవర్ల ఏర్పాటు తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్టాండింగ్‌ కమిటీలో నిర్ణయించినట్లు సమాచారం. కేంద్రప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం సిఫారసు మేరకు గత ఆర్ధిక సంవత్సరంలో జీసీసీ పరిధిలో ఆస్తి పన్ను పెంపుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వచ్చే ఏడాది బడ్జెట్‌లో ఆస్తి పన్ను పెంపు లేకుండానే బడ్జెట్‌ దాఖలు చేయాలని మేయర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యంతోనూ చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చెన్నై వాసులకు తాయిలాలు ఉండవచ్చని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.

Updated Date - 2023-01-26T09:14:14+05:30 IST