Corona cases : కొవిడ్‌ కేసులు పైపైకి

ABN , First Publish Date - 2023-03-26T00:54:01+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు సీజనల్‌ ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు గాను పరీక్షలు, ట్రాకింగ్‌, చికిత్స, వ్యాక్సినేషన్‌, లక్షణాలపై దృష్టి సారించడంపై ..

Corona cases : కొవిడ్‌ కేసులు పైపైకి

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..

ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో మాక్‌డ్రిల్‌

కొత్త కరోనా కేసులు 1,590

న్యూఢిల్లీ, మార్చి 25: దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు సీజనల్‌ ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు గాను పరీక్షలు, ట్రాకింగ్‌, చికిత్స, వ్యాక్సినేషన్‌, లక్షణాలపై దృష్టి సారించడంపై దృష్టి సారించాలని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. ఈ క్రమంలో ఆస్పత్రుల నస్నద్ధతను సమీక్షించడానికి ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌ నిర్వహించనుంది. మందులు, ఐసీయూ సదుపాయాలు, పడకలు, వైద్య పరికరాలు, మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత తదితర వివరాలతో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య కేంద్రాలు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొనాలంటూ కేంద్రం, ఐసీఎంఆర్‌ ఉమ్మడిగా అడ్వైజరీని జారీ చేశాయి. గత కొద్ది వారాలుగా కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు తగ్గిపోవడంపై అడ్వైజరీలో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన ప్రమాణాలతో పోలిస్తే (ప్రతి 10లక్షల మందికి 140 పరీక్షలు) ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల స్థాయి ఏమాత్రం సరిపోదని తేల్చిచెప్పింది. ఫిబ్రవరి మధ్య నుంచి దేశంలో కొవిడ్‌ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయని పేర్కొంది. ఇన్‌ఫ్లూయెంజా లైక్‌ ఇల్‌నె్‌స(ఐఎల్‌ఐ), సివియర్‌ అక్యూట్‌ రెసిపిరేటరీ ఇల్‌నెస్‌ (ఎస్‌ఏఆర్‌ఐ) కేసుల పెరుగుదలకు గల కారణాలను నిశితంగా గమనించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ వ్యాధుల వ్యాప్తిని పరిమితం చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సామాజిక అవగాహన పెంచడం కీలకమని స్పష్టం చేసింది.

టెస్టుల సంఖ్య పెంచండి: కేంద్రం

కొవిడ్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాలని, పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించింది.

5నెలల గరిష్ఠానికి కొత్త కేసులు

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 1,590 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు రావడం 146 రోజుల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,601కి చేరింది. మరోవైపు, కరోనా కారణంగా గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,30,824కు పెరిగింది. కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకూ దేశంలో మొత్తం 4,47,02,257 మందికి కరోనా సోకింది.

Updated Date - 2023-03-26T00:54:01+05:30 IST