Congress vs BJP: మహారాష్ట్రలో బీజేపీకి కాంగ్రెస్‌ ఝలక్‌

ABN , First Publish Date - 2023-03-03T02:29:19+05:30 IST

మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి కంచుకోట లాంటి పుణె జిల్లాలోని కస్బాపేట్‌ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచింది.

Congress vs BJP: మహారాష్ట్రలో బీజేపీకి కాంగ్రెస్‌ ఝలక్‌

పుణె, మార్చి 2 : మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి కంచుకోట లాంటి పుణె జిల్లాలోని కస్బాపేట్‌ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచింది. 28 ఏళ్లుగా బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్న కస్బాపేట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రవీంద్ర దాంగేకర్‌ 73,194 ఓట్లు పొంది విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి హేమంత్‌ రసానెకు 62,244 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముక్తా తిలక్‌ కస్బాపేట్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కేన్సర్‌తో పోరాడిన ముక్తా 2022 డిసెంబరులో కన్ను మూ శారు. దీంతో ఉప ఎన్నిక నిర్వహించగా ఓడిన బీజేపీ తన స్థానాన్ని చేజార్చుకుంది. రవీంద్రకు మహా వికాస్‌ అఘాడీ(ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేన(ఉద్దవ్‌ ఠాక్రే)తో కూడిన కూటమి) మద్దతు ఉంది. బీజేపీ-ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన గత జూన్‌లో మహారాష్ట్రలో అధికారాన్ని చేపట్టింది.ఈ నేపథ్యంలో మహా వికాస్‌ అఘాడీ సాధించిన ఈ విజయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, చిన్చ్‌వాడ్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

Updated Date - 2023-03-03T02:29:28+05:30 IST