Congress Adhir Ranjan : కాంగ్రెస్‌ ఘనతే

ABN , First Publish Date - 2023-09-20T03:51:39+05:30 IST

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో ఆసక్తికర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ బిల్లు తమ పార్టీ ఘనతే అని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి పేర్కొనగా కేంద్ర హోం మంత్రి అమిత్‌

Congress Adhir Ranjan : కాంగ్రెస్‌ ఘనతే

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై అధిర్‌ రంజన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో ఆసక్తికర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ బిల్లు తమ పార్టీ ఘనతే అని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి పేర్కొనగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఖండించారు. అధిర్‌ మాట్లాడుతూ మొట్టమొదటగా 1989లో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చారని గుర్తుచేశారు. అప్పటి నుంచి లోక్‌సభ, అసెంబ్లీల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్‌ కృషి చేస్తోందని చెప్పారు. రాజీవ్‌ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రయత్నించాయని తెలిపారు. లోక్‌సభ ఆమోదం పొందితే రాజ్యసభలో ఆగిపోయేదని, రాజ్యసభ గ్రీన్‌స్నిగల్‌ ఇస్తే లోక్‌సభలో బ్రేక్‌ పడేదని చెప్పారు. మన్మోహన్‌ హయాంలో ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిందని, అందువల్ల ఇంకా సజీవంగా ఉందని పేర్కొన్నారు. దీనికి అమిత్‌ షా స్పందిస్తూ అధిర్‌ చెప్పిన రెండు విషయాలు నిజం కాదని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎప్పుడూ లోక్‌సభ ఆమోదం పొందలేదని స్పష్టం చేశారు. పాత బిల్లు లోక్‌సభలో పెండింగ్‌లో లేదని, 2014లో 15వ లోక్‌సభ రద్దవడంతోనే ఆ బిల్లు కూడా రద్దయిపోయిందని చెప్పారు. ఈ రెండు విషయాల్లో అధిర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేదా అవి వాస్తవమని నిరూపించే పత్రాలు సమర్పించాలని డిమాండ్‌ చేశారు. అధిర్‌ పత్రాలు ఇవ్వకపోతే ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. బీజేపీ ఇన్నాళ్లూ కాలయాపన చేసి ఎన్నికల ముందు ఇమేజ్‌ కోసం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తెచ్చిందన్న కాంగ్రెస్‌ విమర్శలపై కూడా అమిత్‌ షా మండిపడ్డారు. గతంలో అడ్డుపడింది కాంగ్రె్‌సకు ఫ్రెండ్లీ పార్టీలేనని విమర్శించారు. ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించాయి. ఈ బిల్లుపై కాంగ్రెస్‌ ఎప్పుడూ మొక్కబడిగానే వ్యవహరించింది తప్ప సీరియ్‌సగా తీసుకోలేదన్నారు. కాలం చెల్లిపోయేట్టు చేసేదని లేదా దాని ఫ్రెండ్లీ పార్టీలు అడ్డుకునేవన్నారు.

Updated Date - 2023-09-20T03:51:39+05:30 IST