పేదలకు కాంగ్రెస్‌ ద్రోహం

ABN , First Publish Date - 2023-06-01T01:19:02+05:30 IST

మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్‌లో ప్రధాని మోదీ బీజేపీ ప్రచార భేరీ మోగించారు....

పేదలకు కాంగ్రెస్‌ ద్రోహం

రక్తాన్ని పీల్చేసే అవినీతి వ్యవస్థను పెంచి పోషించింది: మోదీ

అజ్మేర్‌, మే 31: మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్‌లో ప్రధాని మోదీ బీజేపీ ప్రచార భేరీ మోగించారు. ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. పేదలకు కాంగ్రె్‌స ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 ఏళ్లయిన నేపథ్యంలో బీజేపీ నెల రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు తలపెట్టింది. ఇందులోభాగంగా అజ్మేర్‌లో బుధవారం భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ తన పాలనలో పేదలను తప్పుదోవ పట్టించే విధానాలను అవలంబించిందని ధ్వజమెత్తారు. ‘‘పేదరిక నిర్మూలన అంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చి 50 ఏళ్లయింది. కానీ, పేదలకు ప్రతిఫలాలు అందకుండా చేయడమే కాంగ్రెస్‌ ఉద్దేశం. అదే అతిపెద్ద ద్రోహం. రాజస్థాన్‌ ప్రజలూ దీనిని అనుభవించారు. తరానికి ఒకసారి వచ్చే అవకాశం.. పార్లమెంటు భవన ప్రారంభోత్సవం. స్వార్థం కోసం అలాంటి దానికి గైర్హాజరు కావడం ద్వారా కాంగ్రెస్‌, మరికొన్ని పార్టీలు 60 వేలమంది కార్మికుల శ్రమను, దేశ సెంటిమెంట్‌ను అవమానించాయి’’ అని మోదీ మండిపడ్డారు. ‘‘ఓ నిరుపేద కుమారుడు.. వారు అనుకున్నదానిని చేయనీయడం లేదని, అవినీతి, వంశపారంపర్య రాజకీయాలకు అడ్డుపడుతున్నాడని కాంగ్రెస్‌ కోపం. దేశ నిర్మాణాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోంది. 2014కు ముందు కాంగ్రెస్‌ రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వం ఉండగా.. అవినీతి, ఉగ్రదాడులకు నిరసనగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో దేశ రక్తాన్ని పీల్చే అవినీతి వ్యవస్థను పెంచి పోషించి ప్రగతిని అడ్డుకుంది. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారత్‌ గురించి మాట్లాడుకుంటున్నారు’’ అని మోదీ అన్నారు.

Updated Date - 2023-06-01T01:19:02+05:30 IST