Lok Sabha seats in UP : యూపీలో ఐదారు లోక్‌సభ సీట్లలోనే కాంగ్రెస్ పోటీ!
ABN , Publish Date - Dec 31 , 2023 | 03:58 AM
ఉత్తర ప్రదేశ్‌లో ఈసారి అయిదారు లోక్‌సభ సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీ చేసే అవకాశాలు తమకు లేవని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా మరోసారి ప్రభంజనం
అంతకుమించి ఎస్పీ ఇచ్చే అవకాశం లేదు
2019లో హస్తం పార్టీకి దక్కింది ఒక్క సీటే
న్యూఢిల్లీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉత్తర ప్రదేశ్‌లో ఈసారి అయిదారు లోక్‌సభ సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీ చేసే అవకాశాలు తమకు లేవని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా మరోసారి ప్రభంజనం వీయవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తుండగా, ఈ ప్రభంజనాన్ని తట్టుకునేందుకు యూపీలో ప్రతిపక్షాల ఐక్యతపై ఆధారపడాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ జాతీయ అలయెన్స్ కమిటీ సభ్యులు భూపేశ్ భగేల్, సల్మాన్ ఖుర్షీద్, యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి అవినాశ్ పాండే, కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత, పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్ యూపీలో పరిస్థితులపై చర్చించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రె్‌సకు 6.36ు ఓట్లు రాగా కేవలం ఒక్క సీటే దక్కింది. ఆ తర్వాత 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత ఘోరమైన ఫలితాలను చవి చూసింది. 399 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 387 స్థానాల్లో డిపాజిట్ కూడా లభించలేదు. దీంతో కాంగ్రెస్.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతోంది. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో తమకు ఎస్పీ నాలుగు కంటే ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశా లు లేవని, కాబట్టి, అయిదారు సీట్ల కంటే ఎక్కువ ఆశించకూడదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
బీజేపీని ఈసారి ఓడించాలి
ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని అడ్డుకోవాలని ఎస్పీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పట్టుదలతో ఉన్నారు. బీసీలు, దళితులు, మైనారిటీలు కలిసికట్టుగా బీజేపీని ఓడిస్తారని ఆయన శుక్రవారం ప్రకటించారు. దీన్ని బట్టి అఖిలేష్.. బీఎస్పీపై మరోసారి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే మాయావతికే ప్రయోజనం లభించింది. బీఎస్పీ 10 సీట్లు గెలుచుకోగా, ఎస్పీ 5 సీట్లకే పరిమితమైంది. అనంతరకాలంలో ఎస్పీ, బీఎస్పీ విడిపోయాయి. ఈసారి విడిగా కాకుండా కలిసి పోటీ చేయాలని భావిస్తున్న అఖిలే్ బీఎస్పీని ఇండియా కూటమిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సమాచారం.