CMK Reddy: భారతీయ సంస్కృతి అత్యున్నతం
ABN , First Publish Date - 2023-01-08T08:25:33+05:30 IST
ప్రపంచ దేశాల్లోకెల్లా భారతీయ సంస్కృతి అత్యున్నతమైనదని తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్,
- ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి
- ఘనంగా ‘నమో గాడ్’ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవం
ప్యారీస్(చెన్నై), జనవరి 7: ప్రపంచ దేశాల్లోకెల్లా భారతీయ సంస్కృతి అత్యున్నతమైనదని తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి(Professor CMK Reddy) పేర్కొన్నారు. స్థానిక కొరట్టూరులోని మోహన్ గార్డన్ ప్రాంగణంలో శనివారం ఉదయం నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్ (ఎన్‌జీసీటీ) ప్రారంభోత్సవం జరిగింది. ప్రార్థనాగీతంతో ప్రారంభమైన ఈ సభలో సీఎంకే రెడ్డి, శ్రీసిటీ ఎండీ డా.రవీంద్ర సన్నారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి డా.ఎం.రాజారాం, ప్రకాశ్ ఫుడ్ ఎండీ డా.డీవీఆర్ ప్రకాశ్‌రావు, మేనేజింగ్ ట్రస్టీ డా.సీఎం కిషోర్ జ్యోతి ప్రజ్వలన చేసి ట్రస్ట్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆచార్య సీఎంకే రెడ్డి మాట్లాడుతూ... కులమత భాషా భేదాలు లేకుండా అందరికీ ఆశ్రయం కల్పిస్తూ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్న భారతీయ సంస్కృతి గొప్పదన్నారు. రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ... వైద్య వృత్తి గౌరవ ప్రదమైనదని అభివర్ణించారు. రాజారాం మాట్లాడుతూ.. ఎన్‌జీసీటీ సేవలు సమాజాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలని సూచించారు. డీవీఆర్ ప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. సంఘసేవ, సమాజసేవలో అఖిల భారత తెలుగు సమాఖ్య పాత్ర కీలకమని, ప్రస్తుతం ఎన్‌జీసీటీ కూడా ఈ బాటలోనే పయనించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించా రు. తమిళ మానిల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వీబీ జవహర్‌బాబు మాట్లాడుతూ.. ప్రజారోగ్యంపై చూపుతున్న శ్రద్ధ వల్లే డా.సీఎం కిషోర్ ఈ ట్రస్ట్ ప్రారంభించారని, ప్రజలు ఈ ట్రస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మేనేజింగ్ ట్రస్టీ కిషోర్ మాట్లాడుతూ.. సమాజానికి మరిన్ని సేవలందించాలన్న దృక్పథంతోనే ట్రస్టీలు డా.ఆర్.నందగోపాల్, డా.ఎన్.నాగభూషణంలతో కలసి ఈ ట్రస్ట్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్‌ఐ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నేత్ర వైద్యపరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు, అవసరమైన వారికి కేటరాక్ట్ ఆపరేషన్‌కు సిఫారసు చేశారు. ఎన్‌జీసీటీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి ఇశ్రాయేలు, నేలటూరి విజయ్‌కుమార్, ఎం.మోహననాయుడు, వి.దేవదానం, లయన్ జి.మురళి, సీఈ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.