CJI Justice Chandrachud; కొలీజియం అత్యుత్తమం
ABN , First Publish Date - 2023-03-19T01:46:57+05:30 IST
కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు వివాదంగా మారిన కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమర్థించారు. న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థ ఉత్తమమైందని పేర్కొన్నారు.

దీనిపై న్యాయ మంత్రితో వాదించను!
రాజ నీతిజ్ఞతతో వ్యవహరిస్తా
న్యాయమంత్రితో చర్చించాలనీ లేదు
న్యాయవ్యవస్థకు స్వతంత్రతే ముఖ్యం
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదు
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలు
ఇండియా టుడే కాంక్లేవ్‌లో సీజేఐVS రిజిజు
న్యూఢిల్లీ, మార్చి 18: కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు వివాదంగా మారిన కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమర్థించారు. న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థ ఉత్తమమైందని పేర్కొన్నారు. ‘‘దేశంలో ఏ వ్యవస్థా పరిపూర్ణంకాదు. కానీ, ఉన్నంతలో కొలీజియం వ్యవస్థ చాలా బాగుంది’’ అని వ్యాఖ్యానించారు. శనివారం నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్-2023లో జస్టిస్ చంద్రచూడ్ పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలంటే.. బయటి వ్యక్తుల ప్రభావాలకు లోనుకాకుండా వాటి నుంచి రక్షణ ఉండాలని అన్నారు. ఇది అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు వ్యక్తం చేసిన అసంతృప్తిపై మాట్లాడుతూ.. ‘‘అవగాహనలో తేడా ఉండడంలో తప్పేముంది? కానీ, ఇలాంటి విభేదాలను దృఢమైన రాజ్యాంగ రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలి తప్ప.. న్యాయ మంత్రితో చర్చించాలని.. కలవాలని కూడా భావించడం లేదు’’ అని అన్నారు. కేసుల తీర్పుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని చెప్పారు. ‘‘న్యాయమూర్తిగా 23 ఏళ్లుగా పనిచేస్తున్నా. కేసును ఎలా నిర్ణయించాలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు నాకు చెప్పలేదు.
ప్రభుత్వం నుంచి అసలు ఒత్తిడి లేదు. దీనికి ఎన్నికల సంఘంపై ఇచ్చిన తీర్పే సాక్ష్యం’’ అని సీజేఐ తెలిపారు. లైంగిక ధోరణికి జడ్జిల సామర్థ్యాలకు సంబంధం లేదని చెప్పారు. స్వలింగ సంపర్కుడైన సీనియర్ అడ్వొకేట్ సౌరభ్ కిర్పాల్‌ను ఈ ఏడాది జనవరిలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించిన సమయంలో అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. అయితే, కొలీజియంకు నేతృత్వం వహించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వాటిని అప్పట్లోనే తోసిపుచ్చారు. తాజాగా ఈ విషయంపై మాట్లాడుతూ.. లైంగిక ధోరణికి, న్యాయమూర్తుల సామర్థ్యాలకు సంబంధం లేదని చెప్పారు. కిర్పాల్‌కు సంబంధించిన ప్రతి విషయాన్నీ, అభ్యంతరాన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉంచామని, దీనికి కారణం.. కొలీజియం పారదర్శకతపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకేనన్నారు.
న్యాయవ్యవస్థ భారతీయీకరణ జరగాలి
దేశంలో న్యాయవ్యవస్థ భారతీయీకరణ జరగాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ‘‘జిల్లా కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని వ్యవహారాలూ ఇంగ్లి్‌షలోనే జరుగుతున్నాయి. ఇది వలస పాలన వల్ల వచ్చిన వారసత్వం కావొచ్చు. లేదా.. శాసనాలు, తీర్పుల పరంగా మనకు గొప్ప సౌలభ్యం ఉన్న భాష అయినా అయి ఉండాలి’’ అని చెప్పారు. కానీ, ప్రజలకు న్యాయవ్యవస్థ చేరువ కావాలంటే.. వారికి అర్థమయ్యే భాషలోనే నడవాలని, దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. కాగా, భారత ప్రధాన న్యాయమూర్తి లైవ్‌లో చర్చలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న తన 18 నెలల కాలంలో ఒక్క అప్పాయింట్‌మెంట్ కూడా జరగకపోవడం వెనుక వేరే కారణం లేదని మాజీ సీజేఐ జస్టిస్ బోబ్డే తెలిపారు. కేవలం కొలీజియంలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే ఎలాంటి నియామకాలు జరగలేదన్నారు. ఇలాంటివి సహజమేనన్నారు.