Chattisgarh: ఫోన్ కోసం రిజర్వాయర్ ఖాళీ చేయించిన అధికారికి రూ.53 వేలు జరిమానా

ABN , First Publish Date - 2023-05-30T17:57:11+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలో ఫోన్ పడిపోయిందంటూ రిజర్వాయర్ ఖాళీ చేయించిన అధికారిపై ప్రభుత్వం రూ.53,092 రూపాయలు జరిమానా విధించింది. రిజర్వాయర్ తోడించేందుకు మౌఖిక అనుమతి ఇచ్చిన జలవనరుల శాఖ సీనియర్ అధికారికి షోకాజ్ నోటీసు ఇచ్చింది.

Chattisgarh: ఫోన్ కోసం రిజర్వాయర్ ఖాళీ చేయించిన అధికారికి రూ.53 వేలు జరిమానా

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌ (Chattisgarh) లోని కాంకెర్ జిల్లాలో ఫోన్ (Phone) పడిపోయిందంటూ రిజర్వాయర్ ఖాళీ (Resevior Drained) చేయించిన అధికారిపై ప్రభుత్వం రూ.53,092 రూపాయలు జరిమానా (Fine) విధించింది. రిజర్వాయర్ తోడించేందుకు మౌఖిక అనుమతి (Oral Permission) ఇచ్చిన జలవనరుల శాఖ సీనియర్ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. రిజర్వాయర్ నుంచి ఖాళీ చేసిన నీటి ఖరీదును అతని జీతం నుంచి ఎందుకు రికవరీ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొంది.

ఘటన వివరాలు...

ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ మే 21న తన మిత్రులతో కలిసి ఫఖంజూర్ ప్రాంతంలో ఉన్న పర్లాకోట్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వెళ్లాడు. రిజర్వాయర్‌పై నిలబడి సెల్ఫీ తీసుకుంటుంటంగా అది చేజారి నీటిలో పడిపోయింది. దానిని తిరిగి పొందేందుకు నీటిని తోడేయాలని భావించి రూ.7,500తో రెండు డీజిల్ పంపులు తెప్పించారు. గత మంగళవారం నీటిని తొలగించే ప్రక్రియ మొదలుపెట్టగా, గురువారం ఈ విషయం బయటకు వచ్చింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు హుటాహుటిన అక్కడికి చేరుకుని పంపును నిలిపివేశారు. ఈ ఘనటపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్లా... రాజేష్ విశ్వాస్‌ను సస్పెండ్ చేశారు.

రిజర్వాయర్ నుంచి 21 లక్షల లీటర్లను తోడేసినట్టు ప్రాథమిక అంచనాగా ఉన్నప్పటికీ, జలవనరుల శాఖ సమగ్ర అంచనా వేసి 41 లక్షల లీటర్లు తోడేసినట్టు గుర్తించింది. దీనిపై మే 26న విశ్వాస్‌కు నోటీసు పంపింది. ఒక్కో క్యూబిక్ వాటర్‌కు రూ.10.56 చొప్పున లెక్కకట్టి రూ.43,092 లక్షలతో పాటు మరో రూ.10,000 జరిమానా చేర్చి మొత్తం చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఈ మొత్తాన్ని 10 రోజుల్లోగా విశ్వాస్ చెల్సించాల్సి ఉంటుంది. కాగా, రిజర్వాయర్ తోడించే ముందు అధికారుల అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తూ జల వనరుల శాఖ అధికారి ఆర్ఎల్ దివాకర్‌కు కూడా ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. తోడేసిన జలాల విలువ లెక్కగట్టి అతని జీతం నుంచి ఎందుకు రికవర్ చేసుకోకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Updated Date - 2023-05-30T17:57:11+05:30 IST