సీబీఐ.. స్వయం ప్రతిపత్తి సంస్థ
ABN , First Publish Date - 2023-11-11T05:24:52+05:30 IST
సీబీఐపై తమ నియంత్రణ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ విభాగమేమీ కాదని తెలిపింది.
సర్కారు నియంత్రణ, ప్రభావం ఏమీ ఉండవు: కేంద్రం
న్యూఢిల్లీ, నవంబరు 10: సీబీఐపై తమ నియంత్రణ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ విభాగమేమీ కాదని తెలిపింది. కేసుల నమోదు, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ల విషయమై తమ కంట్రోల్ ఏమీ ఉండదని పేర్కొంది. అది స్వయంప్రతిపత్తిగల సంస్థ అని, దానికి ఓ బాస్ ఉంటారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై సమాధానం ఇస్తూ ఈ విషయాలను తెలిపింది. సీబీఐకి తాము అనుమతులు నిరాకరించినా, తమకు తెలియకుండానే కేసులు నమోదు చేస్తోందని పేర్కొంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దావా వేసింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై సీబీఐ కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నించింది. దీనిపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్‌ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ సీబీఐ.. కేంద్ర ప్రభుత్వ విభాగం ఏమీ కాదని, అందువల్ల రాజ్యాంగంలోని 131వ అధికరణం ప్రకారం కేసు పెట్టడం చెల్లదని తెలిపారు. అందువల్ల ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని, కొట్టివేయాలని కోరారు. పశ్చిమ బెంగాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. సీబీఐపై కేంద్రం ప్రభావం ఉందా, లేదా అన్నది తేల్చుకోవడం ప్రస్తుత కేసులోని అంశం కాదని, బెంగాల్‌లో కేసులు దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉందా, లేదా అన్నదే ముఖ్య విషయమని చెప్పారు.