BBC: బీబీసీలో సర్వేపై ఐటీ శాఖ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2023-02-17T18:24:25+05:30 IST

ముంబై, ఢిల్లీ బీబీసీ కార్యాలయాలపై జరిపిన సోదాలపై ఐటీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.

BBC: బీబీసీలో సర్వేపై ఐటీ శాఖ కీలక ప్రకటన
CBDT, BBC

న్యూఢిల్లీ: ముంబై, ఢిల్లీ బీబీసీ (BBC) కార్యాలయాలపై జరిపిన సోదాలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) కీలక ప్రకటన విడుదల చేసింది. బీబీసీ ఆర్ధిక లావాదేవీల్లో పలు అక్రమాలు జరిగాయని వెల్లడించింది. బీబీసీకి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుందో సరైన వివరాలు అందించడం లేదని తెలిపింది. డాక్యుమెంట్లు తగిన సమయంలో చూపలేదని కూడా ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. 4 రోజుల పాటు సోదాలు నిర్వహించడానికి ఐటీ అధికారులు ముందే అనుమతి తెచ్చుకున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సిబ్బంది నుంచి సమాచారాన్ని రాబట్టారు. బీబీసీ కంపెనీ నిర్మాణం, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి డేటాను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. బీబీసీ యాజమాన్యం సిబ్బందిని మళ్లీ చెప్పే వరకు ఇంటి నుంచి పని చేయాలని ఆదేశించింది. పది మంది ఉద్యోగులు మాత్రం రెండు రాత్రులు ఆఫీసులోనే ఉండి బీబీసీ భారతీయ విభాగం కార్యకలాపాలను పర్యవేక్షించారు. భారతదేశం నుంచి సొమ్మును విదేశాలకు తరలించడం, భారతదేశంలోని బీబీసీ అనుబంధ సంస్థల మధ్య ఇష్టం వచ్చినట్లు లావాదేవీలు చేయడం ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.

బీబీసీ అనుబంధ సంస్థల ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌కు సంబంధించిన అంశాలపై దర్యాప్తు చేసేందుకు సోదాలు నిర్వహించినట్టు అధికారులు పేర్కొన్నారు. 2012 నుంచి అకౌంట్ల వివరాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అధికారులకు సహకరిస్తున్నామని, వార్తా ప్రసారాలకు సంబంధించి తమ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని బీబీసీ ట్విటర్‌లో పేర్కొంది. 2002లో గుజరాత్‌ అల్లర్లు జరిగినపుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కేంద్రంగా చేసుకుని ఇటీవల బీబీసీ విడుదల చేసిన రెండు విభాగాల డాక్యుమెంటరీ రాజకీయ దుమారం సృష్టించింది.

Updated Date - 2023-02-17T18:39:09+05:30 IST