కాగుతున్న కావేరి!
ABN , First Publish Date - 2023-09-22T02:51:20+05:30 IST
తమిళనాడుకు కావేరి జలాల విడుదల వివాదం కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంలో ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు రోజుకు 5వేల
కర్ణాటకకు సుప్రీంలో చుక్కెదురు
తమిళనాడుకు నీటి విడుదల ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమన్న కోర్టు
బెంగళూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తమిళనాడుకు కావేరి జలాల విడుదల వివాదం కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంలో ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున 15రోజులపాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కావేరీ నీటి నిర్వహణ అథారిటీ, కావేరి జలాల నియంత్రణ కమిటీ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అలాగే రోజుకు 5 వేల క్యూసెక్కులు చాలవని.. 7,200 క్యూసెక్కులు విడుదల చేయాలని తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు కూడా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఆయా కమిటీల్లో నిపుణులు ఉన్నారని.. వర్షపాతం, కరువు, నీటి లభ్యత, అవసరం గురించి వారికి తెలుసని వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో కర్ణాటకవ్యాప్తంగా వివిధ సంస్థలు ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా కావేరి బేసిన్‌లోని రైతాంగం ఉడికిపోతోంది. బెంగళూరు నగర ప్రజలు కూడా కావేరి జలాలపైనే ఆధారపడడంతో తాగునీటి సమస్య తప్పదేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. సుప్రీం తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ సీఎంలు బీఎస్ యడ్యూరప్ప, బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు.