DK X Kharge : డీకే X ఖర్గే!
ABN , First Publish Date - 2023-12-13T06:29:22+05:30 IST
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కులగణన చిచ్చు రేపింది. కులగణనను అశాస్ర్తీయంగా జరిపారంటూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న వక్కలిగ, లింగాయత్ కులాలవారు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణన నివేదికను తిరస్కరించి, మళ్లీ తాజాగా
కర్ణాటక కాంగ్రెస్‌లో కులగణన చిచ్చు
డీకే శివకుమార్ వ్యతిరేకించడాన్ని
రాజ్యసభలో ప్రస్తావించిన బీజేపీ ఎంపీ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని నిలదీత
అగ్రవర్ణాలవారంతా ఒకటేనని ఆక్షేపించిన ఖర్గే
డీకేనూ బీజేపీగాటన కట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు
కులగణనను తాను వ్యతిరేకించలేదన్న శివకుమార్
శాస్త్రీయంగా జరగాలని మాత్రమే కోరానని వివరణ
న్యూఢిల్లీ, బెళగావి, డిసెంబరు 12: కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కులగణన చిచ్చు రేపింది. కులగణనను అశాస్ర్తీయంగా జరిపారంటూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న వక్కలిగ, లింగాయత్ కులాలవారు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణన నివేదికను తిరస్కరించి, మళ్లీ తాజాగా సర్వే నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం అందజేశారు. వక్కలిగ కులానికే చెందిన పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, కొందరు మంత్రులు కూడా ఆ వినతిపత్రంపై సంతకాలు చేయడం వివాదాస్పదమైంది. సోమవారం రాజ్యసభలో జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లులపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కర్ణాటక కులగణన అంశంపై కాంగ్రె్‌సను నిలదీశారు. ఓబీసీలపై కాంగ్రెస్ చూపించేది కపట ప్రేమేనని, కులగణనపై డీకే శివకుమార్ వైఖరే దానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కులగణన నివేదికను విడుదల చేసే ఉద్దేశం ఉందో? లేదో? స్పష్టం చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను సుశీల్‌కుమార్ నిలదీశారు. అదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కల్పించుకొని, డీకేతోపాటు కొందరు మంత్రులు కూడా కులగణనను వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారని చెప్పారు.
దీనిపై స్పందించిన ఖర్గే.. ‘అతను(శివకుమార్) వ్యతిరేకించారు. మీరూ(బీజేపీ) వ్యతిరేకించారు. ఈ అంశంలో అగ్రవర్ణాలవారంతా అంతర్గతంగా ఐక్యంగా ఉన్నారు’ అని విమర్శించారు. ఖర్గే విమర్శ నేపథ్యంలో డీకే శివకుమార్ మంగళవారం వివరణ ఇచ్చారు. తాను కులగణనను వ్యతిరేకించలేదని, శాస్ర్తీయంగా, ఒక క్రమపద్ధతిలో నిర్వహించాలని మాత్రమే కోరానని బెళగావిలో విలేకరులకు డీకే చెప్పారు. ‘నేను కులగణనను ఏ కోశానా వ్యతిరేకించలేదు. అదే మా పార్టీ విధానం. కర్ణాటకలో మా ప్రభుత్వం కులగణన చేసింది కూడా. 2015లో సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం జరిపిన కులగణనలో సిబ్బంది అసలు మా ఇంటికే రాలేదు. ఏ ఒక్కరూ వచ్చి నన్ను వివరాలు అడగలేదు. మా ఎమ్మెల్యేలను కూడా అనేకమందిని ఆరా తీశాను. అతిపెద్ద సమస్య ఏమిటంటే ఆ నివేదికపై నాటి రాష్ట్ర బీసీ కమిషన్ కార్యదర్శి సంతకం కూడా చేయలేదు. సంతకంలేని ఆ నివేదిక చెల్లుబాటవుతుందా? లేదా? అనేదే పెద్ద ప్రశ్న. బాధ్యతలు చేపట్టిన కొత్త చైర్మన్ తప్పులను సరిచేస్తారని నేను భావిస్తున్నా. కులగణన అనేది శాస్ర్తీయంగా జరగాలి. ఎందుకంటే ఒకసారి అది జరిగిన తర్వాత ఆయా కులాలవారు తమ జనాభాకు అనుగుణంగా హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తారు’ అని డీకే వివరించారు. ప్రస్తుతం కె.జయప్రకాశ్ హెగ్డే కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. 2024 జనవరి 31 లోగా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు గడువు ఇచ్చారు. ఇటీవల బిహార్ ప్రభుత్వం కులగణన వివరాలను విడుదల చేసిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరిగింది. దీంతో కమిషన్ నుంచి నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. అయితే, నివేదిక ప్రభుత్వానికి అందకముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి.