55 లక్షల అక్రమ ఫోన్ నంబర్ల రద్దు
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:34 AM
దేశవ్యాప్తంగా 55.52 లక్షల అక్రమ మొబైల్ కనెక్షన్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఆయా సిమ్ కార్డులను తప్పుడు లేదా నకిలీ ధ్రువపత్రాలతో అక్రమంగా పొందినట్టు గుర్తించి
న్యూఢిల్లీ, డిసెంబరు17: దేశవ్యాప్తంగా 55.52 లక్షల అక్రమ మొబైల్ కనెక్షన్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఆయా సిమ్ కార్డులను తప్పుడు లేదా నకిలీ ధ్రువపత్రాలతో అక్రమంగా పొందినట్టు గుర్తించి డీయాక్టివేట్ చేసింది. అలాగే సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలతో సంబంధం ఉన్న 1.32 లక్షల మొబైల్ హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేసింది. ఈ వివరాలను కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ పార్లమెంట్‌కు తెలిపారు. సైబర్ నేరాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన ‘సంచార్ సాథీ’ పోర్టల్ ద్వారా ఈ తప్పుడు మొబైల్ కనెక్షన్లను గుర్తించినట్టు తెలిపారు. ఈ పోర్టల్‌లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గుర్తించిన 13.42 లక్షల అనుమానాస్పద మొబైల్ నంబర్లను కూడా రద్దు చేశామని చెప్పారు. కాగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ఈ సైట్ ద్వారా బ్లాక్, ట్రేస్ చేసే వీలు కూడా ఉంది.