Share News

Justine Trudeau: మెత్తబడిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఆ విషయంలో భారత్‌కి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-10-16T20:04:19+05:30 IST

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఇప్పుడు పూర్తిగా మెత్తబడినట్టు తెలుస్తోంది. నిన్నటిదాకా భారత్‌తో దేనికైనా రెడీ అన్నట్టు వ్యవహరించిన ట్రూడో...

Justine Trudeau: మెత్తబడిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఆ విషయంలో భారత్‌కి శుభాకాంక్షలు

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఇప్పుడు పూర్తిగా మెత్తబడినట్టు తెలుస్తోంది. నిన్నటిదాకా భారత్‌తో దేనికైనా రెడీ అన్నట్టు వ్యవహరించిన ట్రూడో, ఇప్పుడు తన తప్పులను సరిదిద్దుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. అతను తాజాగా భారత్‌కు పంపిన శుభాకాంక్షలే ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. భారత్‌లో దసరా వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో.. కెనడా ప్రధాని అక్టోబర్ 15వ తేదీన హిందూ సమాజానికి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

‘‘నవరాత్రి సందర్భంగా 9 రాత్రులు, 10 రోజుల పగటి సమయాల్లో కెనడాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజ సభ్యులు ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. నవరాత్రి అనేది హిందువుల విశ్వాసంలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పండుగల్లో ఒకటి. రాక్షసుడు మహిషాసురునిపై దుర్గా దేవత సాధించిన విజయాన్ని, అలాగే చెడుపై మంచి సాధించే గెలుపుని జ్ఞాపకంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఇది తరచుగా స్త్రీ శక్తి వేడుకగా కనిపిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి.. ప్రార్థనలు, సంతోషకరమైన ప్రదర్శనలు, ప్రత్యేక భోజనాలు, బాణసంచాతో శతాబ్దాల నాటి సంప్రదాయాలను గౌరవించే సమయం ఇది’’ అంటూ జస్టిన్ ట్రూడో చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఒట్టావా ఒక ప్రకటనను విడుదల చేసింది.


అంతేకాదు.. ఈ నవరాత్రి వేడుకలు హిందూ సమాజపు గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశాన్ని అందిస్తుందని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఈ సంవత్సరం నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్న ప్రతిఒక్కరికీ తన కుటుంబం, కెనడా ప్రభుత్వం తరఫున తాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అయితే.. తన ప్రకటనలో ట్రూడో ఎక్కడా భారత్ ప్రస్తావన తీసుకురాలేదు కానీ, ఈ వేడుకలు మాత్రం కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన భారతదేశానికి చెందినది. ప్రస్తుతం భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో.. ట్రూడో చెప్పిన ఈ శుభాకాంక్షలు ఆ వివాదానికి శుభంకార్డు పడే దిశగా సూచిస్తుందని ఆశించొచ్చు.

గతంలో తనపై విమర్శలు వచ్చినప్పుడే.. నిజ్జర్ హత్య విషయంలో తాము భారత్‌ని రెచ్చగొట్టాలని అనుకోవడం లేదని ట్రూడో స్పష్టం చేశారు. భారత్‌తో సన్నిహిత సంబంధాలను నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా చెప్పారు. ఇప్పుడు నవరాత్రి వేడుకలకు శుభాకాంక్షలు తెలపడం మంచి పరిణామమని చెప్పుకోవచ్చు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. భారత్‌పై తాను చేసిన ఆరోపణలకు ఎందుకు సరైన సమాచారం కెనడా ఇవ్వలేకపోతోంది? నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారత్ సహకారం కోరుతున్న కెనడా ఎందుకు ఆ వివరాల్ని రహస్యంగా ఉంచుతోంది? అనేదే మిస్టరీగా మారింది.

Updated Date - 2023-10-16T20:04:19+05:30 IST