Wrestlers Fight: రెజ్లర్ల ఉద్యమానికి బ్రేక్‌!

ABN , First Publish Date - 2023-06-08T02:42:01+05:30 IST

రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్‌ పడింది.

Wrestlers  Fight: రెజ్లర్ల ఉద్యమానికి బ్రేక్‌!

ఆందోళన 15వరకు వాయిదా వేసినట్టు ప్రకటన.. క్రీడా మంత్రితో చర్చల అనంతరం నిర్ణయం

చర్చల్లో 5 డిమాండ్లు లేవనెత్తిన రెజ్లర్లు

బ్రిజ్‌భూషణ్‌ అరెస్టు తప్ప అన్నింటికీ ఓకే

న్యూఢిల్లీ, జూన్‌ 7: రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్‌ పడింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై ఈ నెల 15వ తేదీ నాటికల్లా విచారణ పూర్తిచేసి, చార్జిషీట్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. అప్పటి వరకు తమ ఆందోళనను నిలిపివేస్తున్నామని రెజ్లర్లు ప్రకటించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో బుధవారం ఐదు గంటలపాటు జరిగిన చర్చల సందర్భంగా రెజ్లర్లు.. ఐదు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. వాటిలో బ్రిజ్‌భూషణ్‌ అరెస్టు మినహా దాదాపు అన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. రెజ్లర్లతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారిని మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నామని పేర్కొంటూ అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం అర్ధరాత్రి ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు. ఈ ఆహ్వానం మేరకు ఒలింపిక్‌ పతక విజేతలు బజ్‌రంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌, ఆమె భర్త సత్యవర్త్‌ కడియన్‌... మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో బుధవారం ఆయన నివాసంలో చర్చలు జరిపారు. హరియాణాలోని తన స్వగ్రామానికి వెళ్లిన వినేశ్‌ ఫొగట్‌ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వానికి, రెజ్లర్లకు మధ్య చర్చలు జరగడం గత ఐదు రోజుల్లో ఇది రెండోసారి. గత శనివారం కూడా వారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించిన సంగతి తెలిసిందే.

15 వరకూ ఆగుతాం: పూనియా

అనురాగ్‌ ఠాకూర్‌తో చర్చల అనంతరం రెజ్లర్‌ బజరంగ్‌ పునియా మీడియాతో మాట్లాడాడు. బ్రిజ్‌భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఈనెల 15లోగా విచారణ పూర్తిచేసి చార్జిషీట్‌ దాఖలు చేస్తారన్న హామీ ప్రభుత్వం నుంచి లభించిందని చెప్పాడు. అప్పటి వరకు ఉద్యమాన్ని నిలిపివేస్తున్నామని, ప్రభుత్వం తీసుకున్న చర్చలను బట్టి.. ఏ విధంగా ముందుకెళ్లాలనేది 15 తర్వాత నిర్ణయిస్తామని చెప్పాడు. అలాగే రెజ్లింగ్‌ ఫెడరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకూ ప్రభుత్వం అంగీకరించిందని, మహిళా అధ్యక్షురాలి నేతృత్వంలో కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలో బ్రిజ్‌భూషణ్‌కు సంబంధించిన వ్యక్తులెవరూ లేకుండా చూస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నాడు. సాక్షి మాలిక్‌ మాట్లాడుతూ.. ‘ఈనెల 15 నాటికి పోలీసు దర్యాప్తు పూర్తవుతుందని మాకు చెప్పారు. అప్పటి వరకు ఉద్యమాన్ని సస్పెండ్‌ చేయాలని కోరారు. మాపై నమోదు చేసిన కేసులను ఢిల్లీ పోలీసులు ఉపసంహరించుకోనున్నారు’ అని చెప్పింది. ఉద్యమాన్ని ఉపసంహరించలేదని, ఇది తాత్కాలికమేనని స్పష్టం చేసింది.

15లోగా చార్జిషీట్‌ వేస్తాం: ఠాకూర్‌

బ్రిజ్‌భూషన్‌పై వచ్చిన ఆరోపణలపై ఈ నెల 15లోగా చార్జిషీట్‌ దాఖలు చేస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చామని అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. రెజ్లర్లతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్‌ 30లోగా రెజ్లింగ్‌ సమాఖ్యకు స్వతంత్య్ర ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. రెజ్లర్ల డిమాండ్లలో దాదాపు అన్నింటినీ ప్రభుత్వం అంగీకరించిందని, వాటితోపాటు డబ్ల్యూఎఫ్‌ఐలో ఒక మహిళ నేతృత్వంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బ్రిజ్‌భూషన్‌ అరెస్టుపై ప్రశ్నించగా.. ఈ కేసులో దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. కాగా, మహిళా రెజ్లర్ల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. అందుకు బీజేపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

రెజ్లర్ల డిమాండ్లు ఇవే..

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి.

● డబ్ల్యూఎఫ్‌ఏకి స్వేచ్ఛాయుత వాతావరణంలో నిస్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలి.

● కొత్తగా ఏర్పాటు చేసే సమాఖ్యలో బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌, ఆయనకు సంబంధించిన వ్యక్తులెవరూ ఉండకూడదు.

● నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరించుకోవాలి.

● బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలి.అతనిపై విచారణ జరిపించాలి.

Updated Date - 2023-06-08T03:55:32+05:30 IST