వేసవిలో రండి.. మోదీకి బైడెన్‌ ఆహ్వానం

ABN , First Publish Date - 2023-02-02T02:52:42+05:30 IST

ఈ వేసవిలో అమెరికాకు రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానించారు.

వేసవిలో రండి.. మోదీకి బైడెన్‌ ఆహ్వానం

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 1: ఈ వేసవిలో అమెరికాకు రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానించారు. ‘‘బైడెన్‌ ఆహ్వానాన్ని మోదీ స్వీకరించారు. రెండు వర్గాలకు అనువైన సమయం విషయంలో ఇరు దేశాల అధికారులు ప్రస్తుతం ప్రణాళిక రచిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌, జూలైలలో ప్రధాని అమెరికా పర్యటన ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌ జరగనున్నాయి. పర్యటనకు కనీసం రెండు రోజుల వ్యవధి ఉండేలా అధికారు లు చూస్తున్నారు. పర్యటనలో శ్వేతసౌధంలో బైడెన్‌తో కలిసి భోజనంతో పాటు అమెరికా చట్టసభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించాల్సి ఉంటుంది’’ అని అధికార వర్గాలు వెల్లడించాయి.

భారత్‌, అమెరికాల మధ్య ఐసీఈటీ ఒప్పందం

భారత్‌, అమెరికాల మధ్య కీలక, ఆధునిక సాంకేతికతల(ఐసీఈటీ) అభివృద్ధి, సహకారాలకు సంబంధించిన కీలక ఒప్పందం కుదిరింది. కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల వంటి రంగాల్లో కలిసి ముందుకు వెళ్లేందుకు గాను ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకా లు చేశారు. ఈ మేరకు శ్వేతసౌధం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా భారత్‌, అమెరికాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరో మెట్టు పైకి ఎక్కిందని అందులో స్పష్టం చేసింది. తాజాగా అమెరికా చేరుకున్న భారత జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోభాల్‌, అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సలివాన్‌తో భేటీ అనంతరం, ఐసీఈటీపై ఒప్పందం కుదిరిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-02-02T02:53:51+05:30 IST