G20 Summit : మానవ హక్కులపై అడిగా

ABN , First Publish Date - 2023-09-12T02:35:44+05:30 IST

ఢిల్లీలో జీ 20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ అంశాలను లేవనెత్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు.

G20 Summit : మానవ హక్కులపై అడిగా

పత్రికా స్వేచ్ఛ అంశాన్నీ లేవనెత్తాను..

మోదీతో భేటీపై బైడెన్‌.. భారత్‌ ప్రకటనలో లేని ‘హక్కులు, స్వేచ్ఛ’

బైడెన్‌ టీమ్‌ను కూడా మీడియాతో మాట్లాడనివ్వలేదు: జైరాం రమేశ్‌

హనోయ్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ఢిల్లీలో జీ 20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ అంశాలను లేవనెత్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. సదస్సు ముగిసిన తర్వాత ఢిల్లీ నుంచి వియత్నాం పర్యటనకు వచ్చిన ఆయన రాజధాని హనోయ్‌లో మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ‘మానవ హక్కులను గౌరవించాల్సిన అవసరం, బలమైన, సుసంపన్నమైన దేశ నిర్మాణంలో పౌర సమాజం, పత్రికా స్వేచ్ఛకు ఉన్న కీలక పాత్ర గురించి మోదీతో భేటీలో లేవనెత్తాను’ అని వివరించారు. అయితే బైడెన్‌తో భేటీపై మోదీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో మాత్రం ఈ అంశాల ప్రస్తావన లేదు. వారి భేటీ సందర్భంగా మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మోదీపై కాంగ్రెస్‌ విమర్శలు సంధించింది. ‘మేం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టం. మిమ్మల్ని పెట్టనివ్వం’ అని బైడెన్‌తో మోదీ చెప్పి ఉంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు. బైడెన్‌ టీమ్‌ను కూడా మీడియాతో మాట్లాడేందుకు కూడా మోదీ ప్రభుత్వం అనుమతించలేదని ఆయన ఆరోపించారు. జూన్‌లో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా బైడెన్‌తో కలిసి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ సబ్రినా సిద్దిఖీ ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నించారు. దాంతో ఆమె సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు. ఈ వేధింపులను వైట్‌హౌస్‌ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో మోదీతో భేటీలో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ అంశాలను లేవనెత్తానని బైడెన్‌ తెలపడం గమనార్హం. వియత్నాం పర్యటనకు వచ్చి ఆ దేశంతో బలపడిన తమ బంధాన్ని చాటిచెప్పడం ద్వారా చైనాతో ప్రచ్ఛన్న యుద్ధం మొదలుపెట్టేందుకు తాను ప్రయత్నించడం లేదని బైడెన్‌ స్పష్టం చేశారు.

రైతు హక్కులపై ఢిల్లీలో సదస్సు

రైతుల హక్కులకు సంబంధించి మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని పూసా కాంప్లెక్సులో నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. మంగళవారం ఈ సదస్సుతో పాటు ప్లాంట్‌ అథారిటీ సెంటర్‌ను కూడా ముర్ము ప్రారంభిస్తారు. జీవ వైవిధ్యాన్ని కాపాడటంతో విశేష కృషి చేస్తున్న 6 రైతు సంఘాలకు, 20 మంది రైతులకు అవార్డులను కూడా ప్రదానం చేస్తారు.

ఇంకా భారత్‌లోనే కెనడా ప్రధాని!

జీ-20 సదస్సు కోసం భారత్‌కు వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో విమానంలో సాంకేతికలోపం తలెత్త డంతో భారత్‌లోనే చిక్కుకుపోయారు. కెనడా సాయుధ బలగాలకు చెందిన విమానం కోసం ఆయన ఎదురుచూస్తున్నారని, మంగళవారం కెనడా బయల్దేరే అవకాశ ముందని టొరంటోసన్‌ పత్రిక స్పష్టం చేసింది. జీ-20 సదస్సులో భారత్‌ సహా ప్రపంచదేశాలు ట్రూడోను నిర్లక్ష్యం చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ డిక్లరేషన్‌తో సానుకూల సంకేతాలు: చైనా

భారత్‌లో జరిగిన జీ20 సదస్సుపై ఎట్టకేలకు చైనా మౌనాన్ని వీడింది. న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ప్రపంచానికి సానుకూల సంకేతాలను పంపించిందంటూ ఒక ప్రకటనలో కొనియాడింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేందుకు దేశాలన్నీ కలిసి పనిచేస్తున్నాయన్న సందేశాన్ని ఇచ్చిందని అభిప్రాయపడింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రత్యేక ప్రతినిధి మావో నింగ్‌ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కాగా.. ప్రపంచ రాజకీయాలకు సాధనంగా మారనంత వరకూ భారత్‌-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక నడవాను స్వాగతిస్తామని చైనా పేర్కొంది

Updated Date - 2023-09-12T03:59:26+05:30 IST