మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ‘అయోధ్య రాముడి’ రగడ
ABN , First Publish Date - 2023-10-30T04:42:23+05:30 IST
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య రామాలయం అంశం హాట్ టాపిక్‌గా మారింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
కాంగ్రె్‌స-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
భోపాల్, అక్టోబరు 28: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య రామాలయం అంశం హాట్ టాపిక్‌గా మారింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రామాలయం అంశాన్ని ప్రచారంలోకి తీసుకురావడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రామాలయం పేరిట ఇతర ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు కూడా వ్యాఖ్యలకు పదును పెంచారు. రామాలయ నిర్మాణం కాంగ్రె్‌సకు నొప్పి పుట్టిస్తోందని అంటున్నారు. బీజేపీ నేతలు రామాలయం అంశాన్ని ఎన్నికల్లో ప్రస్తావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈవారం ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ ఇండోర్ యూనిట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంది. కాంగ్రెస్ ఫిర్యాదుపై బీజేపీ కూడా అదే స్థాయిలో స్పందించింది. ‘కాంగ్రెస్ నేతలు రాముడికి వ్యతిరేకం’ అని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ‘‘కాంగ్రెస్ నాడిలోనే రాముడికి, సనాతన ధర్మానికి, హిందూత్వానికి వ్యతిరేకత ఉంది’’ అని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ దుయ్యబట్టారు. రామాలయ హోర్డింగులు ప్రదర్శించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని కానీ, రాముడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల విశ్వాసానికి ప్రతీక అని శర్మ పేర్కొన్నారు. అంతేకాదు.. ‘‘కాంగ్రెస్ నేతలు కూడా అలాంటి హోర్డింగులు పెట్టుకోవచ్చు. ఎవరు కాదన్నారు. రాముడు అందరివాడని మీ నాయకుడు కమల్‌నాథ్ చెబుతున్నారు. మీరేమో వ్యతిరేకిస్తున్నారు. ఇదేం ద్వంద్వ రాజకీయం’’ అని విమర్శలు గుప్పించారు. ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ చీఫ్ కమల్‌నాథ్ శుక్రవారం మాట్లాడుతూ.. ‘‘రాముడు అందరివాడు. అయోధ్య రామాలయం కేవలం బీజేపీకే సొంతమా? ఇది దేశంలోని ప్రజలందరిదీ’’ అని వ్యాఖ్యానించారు.