‘ఆటోమేటిక్‌ అనర్హత’ రాజ్యాంగ విరుద్ధం

ABN , First Publish Date - 2023-03-26T00:44:05+05:30 IST

పార్లమెంటు సభ్యుల అనర్హతకు వీలు కల్పిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 8(3) రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ సెక్షన్‌ ప్రకారం రెండేళ్ల జైలు శిక్షపడ్డ ప్రజాప్రతినిధులు..

‘ఆటోమేటిక్‌ అనర్హత’ రాజ్యాంగ విరుద్ధం

సుప్రీంకోర్టులో సామాజిక కార్యకర్త మురళీధరన్‌ పిల్‌

న్యూఢిల్లీ, మార్చి 25: పార్లమెంటు సభ్యుల అనర్హతకు వీలు కల్పిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 8(3) రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ సెక్షన్‌ ప్రకారం రెండేళ్ల జైలు శిక్షపడ్డ ప్రజాప్రతినిధులు ‘ఆటోమేటిక్‌’గా పదవులకు అనర్హులవుతారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఈ విధంగా పదవు లు కోల్పోవడం సరికాదని పేర్కొంటూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త ఆభా మురళీధరన్‌ ఈ దావా వేశారు. క్రిమినల్‌ పరువునష్టం కేసులో సూరత్‌లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన తరుణంలో ఈ పిటిషన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ‘ఆటోమేటిక్‌ అనర్హత’కు వీలుకలిగిస్తున్న సెక్షన్‌ 8(3) ఏకపక్షం, చట్టవిరుద్ధమైనదని..దాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ‘ఆటోమేటిక్‌ అనర్హత’ వేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. కేసు స్వరూపం, తీవ్రతలను పట్టించుకోకుండా ఆటోమేటిక్‌గా అనర్హత వేయడం సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. పరువు నష్టం కేసుల్లో పడిన శిక్షలను ఆటోమేటిక్‌ అనర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2023-03-26T00:44:05+05:30 IST