గస్తీ నౌకను చూసి సముద్రంలో బంగారాన్ని విసిరేశారు!

ABN , First Publish Date - 2023-06-02T02:55:06+05:30 IST

మిళనాడులోని రామేశ్వరం సమీపంలోని మండపం సముద్రతీర ప్రాంతం...గస్తీలో ఉన్న నావికాదళం అధికారులు తీరం వైపు ఫైబర్‌ పడవ వస్తుండడాన్ని చూసి వెంబడించారు.

గస్తీ నౌకను చూసి సముద్రంలో   బంగారాన్ని విసిరేశారు!

రెండురోజులు గాలించి 11కిలోలను వెలికితీసిన అధికారులు

చెన్నై, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని మండపం సముద్రతీర ప్రాంతం...గస్తీలో ఉన్న నావికాదళం అధికారులు తీరం వైపు ఫైబర్‌ పడవ వస్తుండడాన్ని చూసి వెంబడించారు. గస్తీ నౌక వస్తుండటాన్ని గమనించిన పడవలోని ఇద్దరు వ్యక్తులు ఓ పార్సిల్‌ను సముద్రంలోకి విసిరేశారు. ఆ ఇద్దరినీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా సముద్రంలో పది కేజీలకు పైగా బంగారు కడ్డీలను పారవేసినట్లు తెలపడంతో నివ్వెరబోయారు. అధికారులు గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపి రెండు రోజులపాటు గాలించిన మీదట గురువారం ఉదయం సముద్రంలో నుంచి 11.6 కేజీల బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. మంగళవారం ఈ సంఘటన జరగ్గా..అదేరోజు మొదటగా నావికాదళం అధికారులు, కేంద్ర ఇంటెలిజెన్స్‌ రెవెన్యూ అధికారులు మండపం ప్రాంతం వద్ద ఓ ఫైబర్‌ బోటులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 21.269 కేజీల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి రాష్ట్రంలోకి రెండు ఫైబర్‌ బోట్లలో అక్రమంగా తరలించిన ఈ మొత్తం 32 కేజీల బంగారం విలువ రూ.20 కోట్లని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-02T03:15:15+05:30 IST