Vajpayee memorial: వాజ్‌పేయి స్మారకం వద్ద ఐక్యత చాటుకున్న ఎన్డీయే

ABN , First Publish Date - 2023-08-16T14:59:08+05:30 IST

మాజీ ప్రధాన దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థలమైన 'సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోం మంత్రి అమిత్‌షా తదితరులు ఆయనకు ఘన నివాళులర్పించారు. తొలిసారి బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయేకు కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Vajpayee memorial: వాజ్‌పేయి స్మారకం వద్ద ఐక్యత చాటుకున్న ఎన్డీయే

న్యూఢిల్లీ: మాజీ ప్రధాన దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థలమైన 'సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోం మంత్రి అమిత్‌షా తదితరులు ఆయనకు ఘన నివాళులర్పించారు. తొలిసారి బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయేకు కీలక నేతలు కూడా వాజ్‌పేయి వర్ధంతి కార్యక్రమంలో హాజరుకావడం విశేషం. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, 2024 లోక్‌సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని ఎన్డీయే భాగస్వాములకు ఈసారి బీజేపీ ఆహ్వానం పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.


వాజ్‌పేయి వర్ధంతి కార్యక్రమానికి హాజరై నివాళులర్పించిన ఎన్డీయే నేతల్లో శరద్ పవార్ ఎన్‌సీపీ నుంచి బయటకు వచ్చిన ప్రఫుల్ పటేల్, అన్నాడీఎంకే నేత ఎం.తంబిదురై, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్ రామ్ మాంఝీ, కేంద్ర మంత్రి, అప్నాదళ్ (సోనెలాల్) నేత అనుప్రియ పటేల్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ చీఫ్ సుదేశ్ మహతో, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎంపీ అగతా సంగ్మా, తమిళ మానిల కాంగ్రెస్ చీఫ్ జీకే వాసన్ తదితరులు ఉన్నారు.


అటల్‌జీ స్ఫూర్తి చిరస్మరణీయం

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, కోట్లాది మంది భారతీయుల హృదయాలలో అటల్‌జీ చిరస్థాయిగా నిలిచారని, పలు జనరేషన్లకు ఆయన స్ఫూర్తి అని అన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో భాగస్వాముల సంఖ్య పెరుగుతోందని అన్నారు. అందరినీ కలుపుకొని తాము వెళ్తున్నామని చెప్పారు. తామంతా కలిసి పోటీచేసి మోదీని మరోసారి గెలిపిస్తామని, 2024లో మోదీ మూడోసారి ఎన్నిక కాగానే దేశవ్యాప్తంగా అభివృద్ధి సాధించి తీరుతామని చెప్పారు.


విజయం తథ్యం

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే విజయం తథ్యమని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ''విపక్షాలకు మరోసారి నిరాశ తప్పదు. 2024లో కూడా దేశ ప్రజలు తమను విశ్వసించరనే విషయం వారికి బాగా తెలుసు. వాళ్లు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. నిరాశ నిస్పృహలతో వారికి తోచినట్టు మాట్లాడుతుంటారు. కానీ దేశ ప్రజలకు మోదీ నాయకత్వంపై పరిపూర్ణ విశ్వాసం ఉంది. 2024 ఎన్డీయే హ్యాట్రిక్ సాధిస్తుంది'' అని అన్నారు.


సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో 26 విపక్ష పార్టీల కూటమి I.N.D.I.A. పేరుతో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో బీజేపీ సైతం ఎన్డీయే బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో ఇండియా కూటమి బెంగళూరులో సమావేశం కాగా, బీజేపీ తమ బలాన్ని చాటుకునేందుకు 38 భాగస్వామ్య పార్టీలతో మెగా సమావేశం నిర్వహించింది. అయితే, ఎన్డీయే కాంక్లేవ్‌లో అనేక పార్టీలు పాల్గొన్నట్టు తాను వినలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు., దీనిపై వెంటనే ప్రధాన మంత్రి మోదీ స్పందించారు. ఎన్డీయేలో చిన్న పార్టీ, పెద్ద పార్టీ అనేది లేదని సమాధానమిచ్చారు.


బీజేపీ భాగస్వామ్య పార్టీలు ఐక్యతను చాటుకునే ప్రయత్నం చేస్తుండగా, ఆపార్టీ ఎప్పుడూ భాగస్వాములను గౌరవించిన పాపాన పోలేదని, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఎప్పుడూ కొనసాగించ లేదని విపక్షాలు విమర్శలకు దిగాయి. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ, బాదల్ సారథ్యంలోని శిరోమణి అకాలీ దళ్ వంటి చిరకాల భాగస్వాములను బీజేపీ పక్కనపెట్టేసిన ఉదంతాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఇందుకు ప్రతిగా బీజేపీ ప్రత్యారోపణలు చేస్తూ, అధికారమే పరమావధిగా కరడుగట్టిన ప్రత్యర్థులతో చేతం కాంగ్రెస్ చేతులు కలుపుతోందని విమర్శిస్తోంది.

Updated Date - 2023-08-16T14:59:08+05:30 IST