PM MODI: హిమాలయాలంత ఉన్నతంగా భారత్‌-నేపాల్‌ సంబంధాలు

ABN , First Publish Date - 2023-06-02T02:52:57+05:30 IST

భారత్‌, నేపాల్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను హిమాలయ శిఖరాల స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు.

PM MODI: హిమాలయాలంత ఉన్నతంగా   భారత్‌-నేపాల్‌ సంబంధాలు

నేపాల్‌ ప్రధాని ప్రచండతో మోదీ చర్చలు

ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు

న్యూఢిల్లీ, జూన్‌ 1: భారత్‌, నేపాల్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను హిమాలయ శిఖరాల స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఇదే స్ఫూర్తితో సరిహద్దు సంబంధిత, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. గురువారం ఆయన నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండతో విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ఇద్దరు నేతలు కలసి రిమోట్‌గా ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అత్యంత కీలకమైన సవరించిన భారత్‌-నేపాల్‌ రవాణా ఒప్పందంతో పాటు సరిహద్దు పెట్రోలియం పైపులైన్‌ విస్తరణ, ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టుల అభివృద్ధి, జలవిద్యుత్‌లో సహకారం పెంపొందించడం వంటి పలు రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఇరు పక్షాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ‘సూపర్‌ హిట్‌’గా మార్చడానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ వెల్లడించారు. తొమ్మిదేళ్ల క్రితం తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల తర్వాత తన మొదటి పర్యటన నేపాల్‌కే చేసినట్లు మోదీ గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాల కోసం అప్పట్లో ‘‘హిట్‌’’ (హైవేస్‌,. ఐ-వేస్‌, ట్రాన్స్‌-వే్‌స) ఫార్ములాను ఇచ్చానన్నారు. తమ భాగస్వామ్యం నిజంగా హిట్‌ అయినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా రామాయణ సర్క్యూట్‌ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు మోదీ చెప్పారు. అనంతరం ప్రచండ మాట్లాడుతూ పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న మోదీ విధానాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. పెట్రోలియం పైప్‌లైన్‌ విస్తరణ, ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టుల నిర్మాణం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకొనే దిశగా ఇరుపక్షాలు చర్చించినట్లు వివరించారు. తొమ్మిదేళ్ల పాలనను పూర్తిచేసుకున్న మోదీని ఆయన అభినందించారు. చర్చల అనంతరం ఇరువురు నాయకులు భారత్‌లోని రుపైదిహా, నేపాల్‌లోని నేపాల్‌గంజ్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులను, బిహార్‌లోని బత్నాహా నుంచి నేపాల్‌ కస్టమ్‌ యార్డు వరకూ కార్గో రైలును వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ప్రచండ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు.

Updated Date - 2023-06-02T02:52:57+05:30 IST