BJP New Presidents: ఎన్నికల టీమ్‌కు బీజేపీ శ్రీకారం
ABN , First Publish Date - 2023-07-05T02:29:12+05:30 IST
తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి! ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి! జార్ఖండ్‌కు మాజీ సీఎం బాబూలాల్ మరాండీ! పంజాబ్‌కు మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖడ్! నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు వచ్చారు. ఈ మేరకు బీజేపీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షుల నియామకం..
మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో నియమించే చాన్స్
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవుల్లో పెద్దపీట
న్యూఢిల్లీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి! ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి! జార్ఖండ్‌కు మాజీ సీఎం బాబూలాల్ మరాండీ! పంజాబ్‌కు మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖడ్! నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు వచ్చారు. ఈ మేరకు బీజేపీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. త్వరలో మరిన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. పలువురిని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించే అవకాశం ఉంది. ఇటీవల బీజేపీ ఓడిపోయిన కర్ణాటక, మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న మధ్య ప్రదేశ్, పార్టీ బలహీనంగా ఉన్న కేరళతోపాటు ఒడిసా, గుజరాత్, హరియాణా వంటి రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర అఽధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, అశ్వత్ నారాయణ, కేరళకు కేంద్ర మంత్రి వి.మురళీధరన్, సురేశ్ గోపి, గుజరాత్‌కు కేంద్ర మంత్రులు పురుషోత్తమ్ రూపాల, మన్షుక్ మాండవీయ, హరియాణాకు కేంద్ర మాజీ మంత్రి కిృషన్‌పాల్ గుజ్జార్, రాం విలాస్ శర్మ, మధ్యప్రదేశ్‌కు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఒడిసాకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తద్వారా, రాబోయే లోక్‌సభ ఎన్నికలు, ఈ ఏడాదిలోనే జరగనున్న తెలంగాణ సహా పలు రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోవడానికి బీజేపీ అగ్ర నేతలు టీమ్‌ను సిద్ధం చేస్తున్నారు. పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరిపి పార్టీలో, ప్రభుత్వంలో మార్పులకు కసరత్తు చేశారు. మంగళవారం నుంచే ఆ మేరకు ప్రక్రియను మొదలుపెట్టారు. తొలుత వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, కీలక పదవుల్లో మార్పులు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా, జాతీయ స్థాయిలోనూ త్వరలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. పలువురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్టీ ఇన్‌చార్జులకు స్థాన చలనం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
వచ్చే వారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వచ్చే వారంలో ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ ఆ మేరకు సంకేతాలిచ్చినట్లు తెలిసింది. ఎన్నికల క్యాబినెట్‌లో భాగంగా ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ముఖాలను మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముంది. సాధ్యమైనంత త్వరగా పార్టీ సంస్థాగత మార్పుచేర్పులను పూర్తి చేసి వారం రోజుల్లో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట
నాలుగు రాష్ట్రాల అధ్యక్షుల మార్పు, కీలక పదవుల్లో నియామకాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బీజేపీ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన సునీల్ జాఖడ్‌కు పంజాబ్ అధ్యక్ష బాధ్యతలు, 2014లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పురందేశ్వరికి ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌కు కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతను ఇచ్చింది. అలాగే, కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. పాత నాయకులకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్తగా పార్టీలో చేరిన వారికి బీజేపీ పెద్దపీట వేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బీజేపీ అధ్యక్షుడిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు
రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమే అయినా.. ఒకే రాష్ట్రానికి వేర్వేరు జాతీయ పార్టీల తరఫున సారథ్య బాధ్యతలు లభించడం చాలా అరుదు. అటువంటి అరుదైన అవకాశం పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన సునీల్ జాఖడ్‌కు లభించింది. కాంగ్రెస్ దివంగత నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ బలరాం జాఖడ్ కుమారుడైన సునీల్ సుదీర్ఘ కాలం కాంగ్రె్‌సలో కీలకంగా వ్యవహరించారు. 2017 నుంచి 2021 వరకు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రె్‌సకు రాజీనామా చేసి గత ఏడాది మేలో బీజేపీలో చేరారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు!