Savyasachi: సవ్యసాచిని మళ్లీ నియమించండి
ABN , First Publish Date - 2023-08-17T03:39:31+05:30 IST
బీజేపీ 2019 ఎన్నికల్లో మాయ చేసిందంటూ పరిశోధన పత్రాన్ని సమర్పించిన అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ సవ్యసాచి దాస్ రాజీనామా.. ఆ వర్సిటీని కుదిపేస్తోంది. విశ్వవిద్యాలయ పాలనా విభాగం తీరుకు నిరసనగా, సవ్యసాచికి మద్దతుగా పి.బాలకృష్ణన్ అనే మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా రాజీనామా చేశారు.
ఆయన పరిశోధన పత్రంపై వర్సిటీ పాలనా విభాగం జోక్యం తప్పు
వారం రోజుల్లోగా పరిస్థితిని చక్కదిద్దకుంటే పాఠాలు చెప్పలేం
అశోకా వర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగం అధ్యాపకుల బహిరంగ లేఖ
సవ్యసాచికి మద్దతుగా మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీనామా
న్యూఢిల్లీ, ఆగస్టు 16: బీజేపీ 2019 ఎన్నికల్లో మాయ చేసిందంటూ పరిశోధన పత్రాన్ని సమర్పించిన అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ సవ్యసాచి దాస్ రాజీనామా.. ఆ వర్సిటీని కుదిపేస్తోంది. విశ్వవిద్యాలయ పాలనా విభాగం తీరుకు నిరసనగా, సవ్యసాచికి మద్దతుగా పి.బాలకృష్ణన్ అనే మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా రాజీనామా చేశారు. అంతేకాదు.. సవ్యసాచి రాజీనామాను వర్సిటీ ఆమోదించిన తీరు.. ఆర్థిక శాస్త్ర విభాగంలోని అధ్యాపకుల, విద్యార్థుల నమ్మకాన్ని తీవ్రంగా వమ్ము చేసిందని పేర్కొంటూ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్ అధ్యాపకులు వర్సిటీ పాలనా విభాగానికి ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రొఫెసర్ దాస్ వర్సిటీ నియమాలను ఏ విధంగానూ ఉల్లంఘించలేదని వారు స్పష్టం చేశారు. అకడమిక్ రిసెర్చ్ మూల్యాంకనాన్ని పీర్ రివ్యూ అనే శాస్త్రీయ ప్రక్రియ ద్వారా చేస్తారని.. కానీ, సవ్యసాచి సమర్పించిన పరిశోధన పత్రంపై వర్సిటీ గవర్నింగ్ బాడీ జోక్యం చేసుకుని, వ్యవస్థాగత వేధింపులకు పాల్పడిందని, అకడమిక్ స్వేచ్ఛకు కోత పెట్టిందని.. ఇది వర్సిటీలోని ఇతర స్కాలర్లను ఒక భయానకవాతావరణంలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తాము తీవ్రమైన పదజాలంతో ఖండిస్తున్నామని.. భవిష్యత్తులో వర్సిటీ గవర్నింగ్ బాడీ ఇదే తరహాలో ఎకనమిక్స్ ఫ్యాకల్టీ పరిశోధనలపై జోక్యం చేసుకుంటామంటే అందుకుతాము సహకరించబోమని తేల్చిచెప్పారు. దేశంలోనే గొప్ప ఆర్థిక శాస్త్ర విభాగాల్లో ఒకటిగా అశోకా యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడి పేరు సంపాదించుకుందని.. ఇప్పుడా విభాగం మనుగడకే వర్సిటీ పాలనా విభాగం ముప్పుగా తయారైందని ఆందోళన వెలిబుచ్చారు. పాలనావిభాగం తీరు ఫ్యాకల్టీ వలసలను వేగవంతం చేయడమే కాక.. కొత్త అధ్యాపకులు రాకుండా నిరోధిస్తుందని పేర్కొన్నారు. కాబట్టి.. ప్రొఫెసర్ సవ్యసాచి దాస్‌కు మళ్లీ బేషరతుగా వర్సిటీలో ఉద్యోగాన్ని ఆఫర్ చేయాలని, అధ్యాపకులు చేసే పరిశోధనల మూల్యాంకనంలో పాలనా విభాగం ఎటువంటి కమిటీల ద్వారా జోక్యం చేసుకోదని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అకడమిక్ స్వేచ్ఛకు సంబంధించిన ఈ సమస్యను కొత్త సెమిస్టర్ మొదలయ్యేలోగా పరిష్కరించకుంటే.. ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌లోని అధ్యాపకులు తమ బోధనను కొనసాగించలేరని హెచ్చరించారు. మరో వారం రోజుల్లో.. అంటే ఆగస్టు 23లోగా పాలనా విభాగం ఈ సమస్యను పరిష్కరించకుంటే అశోకా యూనివర్సిటీలోని అతిపెద్ద విభాగం (ఆర్థిక శాస్త్రం) క్రమంగా బలహీనపడిపోతుందంటూ రాజీనామాల ముప్పుపై ముందుగా హెచ్చరించారు. ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్ రాసిన లేఖకు వర్సిటీలోని ఇంగ్లిష్, క్రియేటివ్ రైటింగ్ విభాగాలు కూడా ఉమ్మడి ప్రకటన ద్వారా సంఘీభావం తెలిపాయి. ప్రొఫెసర్ సవ్యసాచిదా్‌సను వెంటనే ఉద్యోగంలో చేర్చుకోవాలని డిమాండ్ చేశాయి.