PAN : ఇక పాన్‌లోనే మీ జాతకం!

ABN , First Publish Date - 2023-02-02T02:22:42+05:30 IST

డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ ద్వారా దేశ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన మోదీ సర్కారు ఇప్పుడు మరిన్ని డిజిటల్‌

PAN : ఇక పాన్‌లోనే మీ జాతకం!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ ద్వారా దేశ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన మోదీ సర్కారు ఇప్పుడు మరిన్ని డిజిటల్‌ ప్రయోగాలకు సిద్ధమైంది. పాన్‌ నంబరును కామన్‌ బిజినెస్‌ ఐడెంటిఫయర్‌గా ఉపయోగించాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అనుమతుల కోసం వ్యాపారులు వచ్చినపుడు పాన్‌ నంబరు చెబితే చాలు. అధికారులు వ్యాపారి పాన్‌ నంబరు కొట్టగానే దానికి అనుసంధానమై ఉన్న అన్ని పత్రాలు కనిపిస్తాయి. ఇక నుంచి ఆయా పత్రాల జిరాక్స్‌ కాపీలను ప్రభుత్వ కార్యాలయాల్లో పదేపదే ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో చూసి ఓకే చేస్తారు కాబట్టి దరఖాస్తుల పరిష్కారం వేగవంతం అవుతుంది. ప్రస్తుతం వ్యాపారాలకు వివిధ రకాల అనుమతులు ఇచ్చేందుకు 13కు పైగా వివిధ రకాల కార్డులను ఐడీలుగా అడుగుతున్నారు. ఇక నుంచి పాన్‌ ఇస్తే చాలు. అనుమతులు, క్లియరెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో సింగిల్‌ విండో వ్యవస్థను తెచ్చే దిశగా ఇది ముందడుగు కానుంది.

నేషనల్‌ డేటా గవర్నింగ్‌ పాలసీ

ప్రస్తుతం వ్యక్తుల వివరాలను ధ్రువీకరించే కేవైసీ ప్రక్రియ సంక్లిష్టంగా ఉంది. దాన్ని సరళతరం చేసేందుకు ప్రభుత్వం రిస్క్‌ ఆధార వ్యవస్థ ఏర్పాటు చేయనుంది. కేవైసీ సమాచారంలో వ్యక్తి డేటా లీకయితే వచ్చే ముప్పును ప్రాతిపదికగా చేసుకొని కొన్ని రకాల కేవైసీలను సరళతరం చేస్తారు. వ్యక్తి ఐడెంటిటీని, చిరునామాను ఒకే వ్యవస్థ ద్వారా ధ్రువీకరిస్తారు. ఆధార్‌ను ప్రధాన ఐడెంటిటీగా పరిగణిస్తూ డిజిటల్‌ లాకర్‌ ద్వారా మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ డేటా గవర్నింగ్‌ పాలసీ తీసుకురానుంది. వ్యక్తి డేటాలో ఏది బహిర్గతం చేయొచ్చు... ఏది చేయరాదు... అనేది దీనిద్వారా నిర్ణయిస్తారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం దగ్గర పోగుపడిన డేటాను స్టార్ట్‌పలు, విద్యాసంస్థల్లో పరిశోధకులు వాడుకొనేందుకు అనుమతిస్తారు. భవిష్యత్తులో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే మెషిన్‌ లెర్నింగ్‌ కీలకపాత్ర పోషించనుంది. దీనికి భారీ స్థాయిలో డేటా అవసరం. నేషనల్‌ డేటా గవర్నింగ్‌ పాలసీ ఇందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఆర్థిక, అనుబంధ సమాచారాన్ని భద్రపరచేందుకు కేంద్రీకృత రిపాజిటరీగా నేషనల్‌ ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తారు. కాగా, డిజీ లాకర్‌ పరిధిని పెంచి.. విద్యార్థుల సర్టిఫికెట్లకే కాకుండా ఎంఎ్‌సఎంఈల డాక్యుమెంట్లకు వేదికగా మారుస్తున్నారు.

మైనారిటీ శాఖకు 38శాతం నిధుల కోత

2023-24 బడ్జెట్‌లో మైనారిటీ మంత్రిత్వ శాఖకు నిధుల కేటాయింపులో కోత విధించారు. గతే డాదితో పోలిస్తే 38శాతం నిధులు తగ్గించారు. 2022-23 బడ్జెట్లో రూ. 5020.50 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 2612.66 కోట్లు కేటాయించారు. అసలైతే ఈ సంవత్సరానికి మైనారిటీ శాఖ రూ. 3097.60 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపింది. విద్యాభివృద్ధికి రూ. 1,689 కోట్లు, నైపుణ్యాభివృద్ధికోసం రూ. 64.4 కోట్లు, ఆంబ్రెల్లా ప్రోగ్రామ్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ కోసం రూ. 610 కోట్ల ప్రతిపాదనలు పంపారు.‘ ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు శుభాకాంక్షలు. నిజంగానే ఇది అమృతకాల్‌ బడ్జెట్‌. మౌలిక వసతులు, టెక్నాలజీ, గ్రీన్‌ ఎనర్జీ తదితర రంగాల్లో గణనీయ వృద్ధికి ఈ బడ్జెట్‌ దోహదపడుతుంది’ అని మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతీ ఇరానీ ట్వీట్‌ చేశారు.

4 నెలల కనిష్ఠానికి దేశ నిరుద్యోగిత రేటు

జనవరిలో భారతదేశ నిరుద్యోగిత రేటు 4నెలల కనిష్ఠానికి పడిపోయింది. గత నెలలో 7.14ు నమోదు అయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) బుధవారం వెల్లడించింది. కాగా గతేడాది డిసెంబరులో 8.30ు, నవంబరులో 8 శాతం, సెప్టెంబరులో 6.43శాతం నమోదైంది. జనవరిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 8.55శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 6.48శాతంగా నమోదైంది. నిరుద్యోగిత రేటును రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే 21.8 శాతంతో అత్యధికంగా జమ్మూకశ్మీర్‌, 21.7శాతంతో హరియాణా ద్వితీయ స్థానంలో ఉండగా ఉండగా.. 0.5శాతంతో ఛత్తీస్‌గఢ్‌లో అత్యల్పంగా నమోదైంది.

తలసరి ఆదాయం రూ.1.97 లక్షలు...

తలసరి ఆదాయం విషయానికివస్తే.. 2014 నుంచి చూస్తే ఇది రెండింతలకు పైగా పెరిగి రూ.1.97 లక్షలకు పెరిగినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇదే కాలంలో తలసరి రుణ భారం కూడా భారీగానే పెరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ప్రభుత్వ అప్పు రూ.55 లక్షల కోట్లు ఉందని, 2014 నుంచి 2023 వరకు మొత్తం అప్పు రూ.55 లక్షల కోట్ల నుంచి రూ.155 లక్షల కోట్లకు పెరిగిందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ ఆరోపించారు. దేశంలో తలసరి అప్పు రూ.43,000 నుంచి రూ.1,09 లక్షలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. తలసరి అప్పు 2.5 రెట్లు పెరిగిందని, దేశం మొత్తం అప్పు 2.75 రెట్లకు పైగా ఎగబాకిందని వల్లభ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-02T10:42:16+05:30 IST