TN Legislative Assembly : పరిధి దాటిన గవర్నర్
ABN , First Publish Date - 2023-04-11T03:32:12+05:30 IST
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడానికి నిర్ధిష్ఠ గడువును నిర్దేశించాలని రాష్ట్రపతి, కేంద్రప్రభుత్వాలను కోరుతూ తమిళనాడు శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది.
రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు..
శాసనసభ ఆమోదించిన బిల్లులను తొక్కిపెడుతున్నారు
బిల్లుల ఆమోదానికి గడువు నిర్దేశించండి
రాష్ట్రపతి, కేంద్రంలకు తమిళనాడు అసెంబ్లీ విజ్ఞప్తి
ఎట్టకేలకు తమిళనాట ఆన్‌లైన్ జూదం నిషేధం
హడావుడిగా బిల్లుకు గవర్నర్ ఆమోదం
చెన్నై, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడానికి నిర్ధిష్ఠ గడువును నిర్దేశించాలని రాష్ట్రపతి, కేంద్రప్రభుత్వాలను కోరుతూ తమిళనాడు శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. సోమవారం సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం స్టాలిన్.. గవర్నర్ భారత రాజ్యాంగం కంటే అధికంగా బీజేపీ నాయకత్వానికి విధేయత ప్రదర్శిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో గవర్నర్ల తీరుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కూడా సోమవారం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే గత 6 నెలలుగా తొక్కిపెట్టిన ఆన్‌లైన్ జూదం నిషేధ బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్.రవి హడావుడిగా సోమవారం ఆమోదం తెలిపారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ‘గవర్నర్‌కు రాజ్యాంగం గురించి తెలియదని నేను చెప్పను. అయితే, ఆయనలోని రాజకీయ విధేయత.. రాజ్యాంగం పట్ల ఉన్న విధేయతను మింగేసింది. రాజకీయ కారణాలతో మా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని గవర్నర్ ఇలాగే కొనసాగిస్తే, చూస్తూ ఊరుకోలేను. ఈ ఏడాది రెండోసారి ఆయనపై ఇలా తీర్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నర్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉండాలని సర్కారియా కమిషన్ సూచించింది. కానీ, ఈ గవర్నర్ స్నేహపూర్వకంగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. ప్రభుత్వ విధానాలను, తమిళుల మనోభావాలను, శాసనసభ సార్వభౌమత్వాన్ని, ప్రజా సంక్షేమం కోసం సభ ఆమోదించిన బిల్లులను ఆయన అవమానిస్తున్నారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతోపాటు బిల్లులను తొక్కిపెట్టడం ఆయనకు అలవాటుగా మారింది. రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌లాగా మార్చేశారు. తమిళనాడు ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న గవర్నర్ చర్యల పట్ల ఈ సభ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది’ అని పేర్కొన్నారు.