Share News

Amit Shah: ‘మహాదేవ్’ చిచ్చు.. అందుకు సిగ్గుండాలంటూ భూపేష్ బఘేల్‌పై అమిత్ షా కౌంటర్ ఎటాక్

ABN , First Publish Date - 2023-11-09T16:46:37+05:30 IST

Mahadev Betting App: ‘మహాదేవ్’ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. ఆ యాప్ నిర్వాహకుల నుంచి ఎన్నికల ఖర్చు కోసం సీఎం భూపేష్ బఘేల్ రూ.500 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజమా? కాదా?

Amit Shah: ‘మహాదేవ్’ చిచ్చు.. అందుకు సిగ్గుండాలంటూ భూపేష్ బఘేల్‌పై అమిత్ షా కౌంటర్ ఎటాక్

‘మహాదేవ్’ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. ఆ యాప్ నిర్వాహకుల నుంచి ఎన్నికల ఖర్చు కోసం సీఎం భూపేష్ బఘేల్ రూ.500 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజమా? కాదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. కానీ.. బీజేపీ మాత్రం భూపేష్ దేవుడి పేరుపై భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూనే ఉంది. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అదే పాట పాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాదేవ్’ పేరుతో బెట్టింగ్‌లకు పాల్పడిందని పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో చంద్రుడిపైకి ‘చంద్రయాన్‌’ వెళ్లింది. చంద్రునిపై అది దిగిన ప్రదేశానికి మోదీ ‘శివశక్తి’ అనే పేరు పెట్టారు. కానీ.. ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాదేవ్’ పేరుతో ఒక బెట్టింగ్ యాప్‌ని ఓపెన్ చేసి, కుంభకోణాలకు పాల్పడింది. మహాదేవ్ పేరిట అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుండాలి. చివరికి ‘మహాదేవ్’ పేరుని కూడా వాళ్లు విడిచిపెట్టలేదు’’ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. విచారణ కమిషన్‌ వేసి, అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ జైలుకు పంపుతామని అన్నారు.


గత ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో అవినీతి పాలన సాగిందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుంభకోణాలకు పాల్పడిందని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విపరీతంగా మత మార్పిడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. కానీ.. బీజేపీ అలాంటి పని చేయనివ్దని మాటిచ్చారు. ఆదివాసీల అనుమతి లేకుండా మతం మార్చడాన్ని బీజేపీ అనుమతించదని, వారికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఐదేళ్లలోనే రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు.

ఇదంతా బాగానే ఉంది కానీ.. ‘కలిసి చర్చించుకుందాం రండి’ అని సీఎం భూపేష్ బఘేల్ చేసిన సవాల్‌పై మాత్రం అమిత్ షా నోరు మెదపకపోవడం గమనార్హం. మొదట భూపేష్‌కి ఛాలెంజ్ చేసింది కూడా అమిత్ షానే. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడానికి సిద్ధమా? అని షా సవాల్ చేయగా.. దాన్ని భూపేష్ స్వీకరిస్తూ, మరో ప్రతి సవాల్ చేశారు. అంతకుముందు బీజేపీ హయాంలో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కూడా చర్చిద్దాం రండి అని భూపేష్ పిలుపునిచ్చారు. తన పేరుతో పాటు అమిత్ షా పేరు రాసి ఉన్న సోఫా పోటీని కూడా షేర్ చేశారు. కానీ.. అమిత్ షా నుంచి మాత్రం స్పందన రాలేదు.

Updated Date - 2023-11-09T16:46:39+05:30 IST