American visa interviews : శనివారాల్లోనూ అమెరికా వీసా ఇంటర్వ్యూలు!

ABN , First Publish Date - 2023-01-23T02:58:33+05:30 IST

తొలిసారి అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త. ఇలాంటి వారు వీసా ఇంటర్వ్యూ కోసం నిరీక్షించే సమయాన్ని తగ్గించడానికి భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలు తొలిసారిగా శనివారం కూడా ఇంటర్వ్యూలు

American visa interviews : శనివారాల్లోనూ అమెరికా వీసా ఇంటర్వ్యూలు!

ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని కాన్సులేట్లలో అదనపు స్లాట్లు

న్యూఢిల్లీ, జనవరి 22: తొలిసారి అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త. ఇలాంటి వారు వీసా ఇంటర్వ్యూ కోసం నిరీక్షించే సమయాన్ని తగ్గించడానికి భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలు తొలిసారిగా శనివారం కూడా ఇంటర్వ్యూలు చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ నెల 21న (శనివారం) ఇలా వీసా ఇంటర్వ్యూలు చేశాయి. వ్యక్తిగతంగా వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారి కోసం ఢిల్లీలోని అమెరికా ఎంబసీ; ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లోని కాన్సులేట్‌లు ప్రత్యేకంగా శనివారం కూడా కార్యకలాపాలు కొనసాగించాయి. రాబోయే నెలల్లో కూడా ఎంపిక చేసిన శనివారాల్లో వీసా దరఖాస్తుదారుల కోసం అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. కొవిడ్‌-19 కారణంగా వీసాల జారీ ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొనడంతో పాటు వీసాల కోసం నిరీక్షించాల్సిన సమయం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో అమెరికా దౌత్య కార్యాలయాలు ఈ మేరకు పలు చర్యలు చేపడుతున్నాయి.

  • గతంలో అమెరికా వీసా ఉన్న దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ లేకుండా రిమోట్‌ ప్రాసెసింగ్‌ విధానాన్ని అమెరికా విదేశాంగ శాఖ అమలు చేస్తోంది.

  • అమెరికా ఎంబసీ, కాన్సులేట్లకు శాశ్వత కాన్సులర్‌ అధికారుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 2.50 లక్షలకు పైగా బీ1/బీ2 అపాయింట్‌మెంట్లను కేటాయించింది.

  • వీసాల జారీ ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచేందుకు గాను ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో వాషింగ్టన్‌, ఇతర ఎంబసీల నుంచి పదుల సంఖ్యలో కాన్సులర్‌ అధికారులు భారత్‌కు రానున్నారు.

  • అదనపు అపాయింట్‌మెంట్ల కోసం ముంబై కాన్సులేట్‌ జనరల్‌ వారంలో పనిగంటల సంఖ్యను పెంచింది. ఈ వేసవికల్లా భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో అదనపు సిబ్బంది సాయంతో వీసాల జారీ ప్రక్రియ.. కొవిడ్‌ సంక్షోభానికి పూర్వ స్థితికి చేరుకుంటుందని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-01-23T02:58:34+05:30 IST