Congress Adjustment of seats : నెలాఖరుకల్లా సీట్ల సర్దుబాటు!

ABN , First Publish Date - 2023-09-01T01:04:38+05:30 IST

మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ‘ఇండియా’ కూటమి నేతలు.. సెప్టెంబరు 30కల్లా సీట్ల సర్దుబాటుపై తుదినిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చారు. గురువారం ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో

Congress Adjustment of seats : నెలాఖరుకల్లా సీట్ల సర్దుబాటు!

ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో

‘ఇండియా’ కూటమి నేతల యోచన

ముంబైలో ఇష్టాగోష్ఠి భేటీకి 28

పార్టీలకు చెందిన 63 మంది నేతలు

నేటి సమావేశానికి అజెండా ఖరారు

కూటమికి కన్వీనర్‌, కనీస

ఉమ్మడి కార్యక్రమంపై నేడు చర్చ

11 మందితో సమన్వయకమిటీ

కూటమి లోగోను ఆవిష్కరించే చాన్స్‌

ముంబై, ఆగస్టు 31: మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ‘ఇండియా’ కూటమి నేతలు.. సెప్టెంబరు 30కల్లా సీట్ల సర్దుబాటుపై తుదినిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చారు. గురువారం ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో వారంతా ఇష్టాగోష్ఠిగా సమావేశమై.. శుక్రవారం జరగబోయే సమావేశానికి ఎజెండా ఖరారు చేశారు. కూటమికి కన్వీనర్‌ ఉండాలా వద్దా? సీట్‌ షేరింగ్‌పై సబ్‌గ్రూపులను ఏర్పాటు చేయాలా? అనే అంశాలతోపాటు విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాల గురించి, కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పనపైన శుక్రవారం భేటీలో చర్చించనున్నారు. 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు గురువారంనాటి భేటీకి హాజరుకాగా వారిలో పలువురు నేతలు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. తుది నిర్ణయం ఆధారంగా అన్ని పార్టీల రాష్ట్ర కమిటీలూ సీట్ల సర్దుబాటు ఫార్ములాను అమలు చేయనున్నాయి. అలాగే శుక్రవారం భేటీ అనంతరం.. కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన 11 మంది నేతలతో కో-ఆర్డినేషన్‌ కమిటీని ప్రకటించడంతోపాటు కూటమి లోగోను ఆవిష్కరించే అవకాశం ఉంది. కాగా..ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకే తామందరం చేతులు కలిపామని.. అధికార బీజేపీని గద్దె దించేందుకు అవసరమైన ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామని ఈ సమావేశంలో పాల్గొన్న విపక్షాల నాయకులు పేర్కొన్నారు. ఇండియా కూటమి భేటీ శుక్రవారం కూడా కొనసాగనుంది.

ప్రమాదంలో సమాఖ్య భావన..

దేశ సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేసి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ప్రస్తుతం ఉందని ఈ భేటీకి హాజరైన బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. పేదరికం, నిరుద్యోగం, రైతుల సంక్షేమం అంశాల్లో మోదీ సర్కారు విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో తామంతా కలిసి మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామని లాలూ తెలిపారు. ఎన్నికల్లో బీజేపీపై విపక్షాలన్నీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెడతామన్నారు. దేశంలో సమాఖ్య భావన ప్రమాదంలో పడిందని, బీజేపీయేతరపాలిత రాష్ట్రాలను కేంద్రం తీవ్రంగా వేధిస్తోందని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఆగ్రహం వెలిబుచ్చారు. ఇండియా కూటమిని బీజేపీ ద్వేషించడమే కాక.. ఎక్కడ విజయం సాధిస్తుందో అని భయపడుతోందని, ‘ఇండియా’ అనే పదాన్నే ద్వేషి స్తూ చివరికి ఆ పదాన్ని ఉగ్రవాద సంస్థల పేర్లతో పో లుస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చద్దా మండిపడ్డారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఇండియా కూటమి కృషి చేస్తోందని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా అన్నారు. తమది కేవలం ‘పార్టీల కూటమి’ కాదని.. ‘ఆలోచనల కూటమి’ అని ఆయన పేర్కొన్నారు.

దేశానికి సాంత్వన.. దేశ పునర్నిర్మాణానికి తమ కూటమి అవసరమని మనోజ్‌ స్పష్టం చేశారు. ఇండియా కూటమికి ప్రజల నుంచి వస్తున్న స్పందన.. ప్రధానిని, బీజేపీని నిస్త్రాణకు గురిచేస్తున్నట్టు సీపీఎం జనరల్‌ సెక్రటరీ సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు విధానాల వల్ల ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోయా యని.. ఆ విధ్వంసాన్ని సరిచేసే సవాల్‌ ఇండియా కూటమి ముందుందని ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుప్రియా సూలే అన్నారు. ఈ భేటీ అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే.. కూటమి నేతలకు విందు ఇచ్చారు. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని.. ఇండియా కూటమి ఆ ప్రత్యామ్నాయాన్ని వారికి ఆఫర్‌ చేస్తోందని తేజస్వీ అన్నారు. సమాజాన్ని విభజించేవారికి తాము తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. కూటమి భేటీకి ముందు కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీ శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నేతలైన ఆదిత్య ఠాక్రే, సంజయ్‌రౌత్‌, ఎన్సీపీ నేతలు సుప్రియా సూలే, జయంత్‌పాటిల్‌తో ముచ్చటించారు. మరోవైపు.. ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కాసేపు మాటలు కలిపారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ సుప్రీం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్రీయ లోక్‌దళ్‌ చీఫ్‌ జయంత్‌ చౌదరి తదితర హేమాహేమీలతో భేటీ సందడిగా మారింది.

కూటమిలోకి కొత్తగా 2 పార్టీలు

ఇండియా కూటమిలో ఇన్నాళ్లుగా 26 పార్టీలు ఉండగా.. గురువారంనాటి భేటీకి మరో రెండు పార్టీలు కొత్తగా హాజరయ్యాయి. వాటిలో ఒకటి ‘పీసెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (పీడబ్ల్యూపీ)’ కాగా.. మరొకటి మహారాష్ట్రలోని మార్క్సిస్ట్‌ పొలిటికల్‌ పార్టీ. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ‘అసోం జాతీయ పరిషత్‌’, ‘రైజోర్‌ దళ్‌’, ‘ఆంచలిక్‌ గణ్‌ మంచ్‌ భుయాన్‌’ కూడా ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నాయి. వాటి చేరికపై కూటమి నేతలు శుక్రవారం చర్చించనున్నట్టు సమాచారం.

Updated Date - 2023-09-01T01:04:38+05:30 IST