Adani : ప్రతిష్ఠ కోసం అదానీ పాకులాట
ABN , First Publish Date - 2023-02-21T04:04:09+05:30 IST
హిండెన్‌బర్గ్ నివేదికతో ఖంగుతిన్న అదానీగ్రూప్ రూటు మార్చింది.
అమెరికా పీఆర్ సంస్థతో డీల్
పెద్ద ఎత్తున ప్రచారానికి సిద్ధం
కేసుల కోసం మరో సంస్థతో ఒప్పందం
ముంబై, ఫిబ్రవరి 20: హిండెన్‌బర్గ్ నివేదికతో ఖంగుతిన్న అదానీగ్రూప్ రూటు మార్చింది. పోయిన పరువును కొంతైనా తిరిగి పొందేందుకు, పరువు మరింత పోకుండా కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పెట్టుబడిదారుల్లో తిరిగి నమ్మకం కలిగించేందుకు పెద్ద ఎత్తున ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా క్రైసిస్ మేనేజ్‌మెంట్, గ్లోబల్ కమ్యూనికేషన్స్‌లో పేరున్న కెక్ట్స్ సీఎన్‌సీ అనే పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. న్యూయార్క్, మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే ఈ పీఆర్ సంస్థ త్వరలోనే తన ప్రచారం ప్రారంభించనుంది.
ఈ సంస్థ ముఖ్యంగా ఈఎస్‌జీ ప్రామాణికాలు పాటించే వెల్త్, పెన్షన్ ఫండ్స్‌కు నచ్చజెప్పే ప్రచారం ప్రారంభించనుంది. అదానీ గ్రూప్ చేపట్టిన హరిత ఇంధన ప్రాజెక్టుల గ్రీన్ బాండ్స్‌లో ఈ సంస్థలు 800 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. వీటికితోడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలోనూ 1,500 కోట్ల డాలర్ల వరకు కుమ్మరించాయి. ఈ సంస్థలు ఏ మాత్రం తమ పెట్టుబడుల ఉపసంహరణకు ఉపక్రమించినా అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. దీంతో ముందు ఈ పీఆర్ సంస్థ ద్వారా ఆ సంస్థలను నచ్చజెప్పే ప్రయత్నాలు చేయాలని అదానీ గ్రూప్ భావిస్తున్నట్టు సమాచారం.
హిండెన్‌బర్గ్‌పై న్యాయ పోరాటానికీ సై...
ప్రచారంతోపాటు తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిండా ముంచిన హిండెన్‌బర్గ్ రీసెర్చి సంస్థ పనిపట్టేందుకూ అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ‘వాచ్‌టెల్’ అనే అమెరికా న్యాయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. భారీగా ఫీజు చెల్లించగల సంస్థలు తప్ప.. చిన్నాచితకా సంస్థలేవీ ‘వాచ్‌టెల్’ న్యాయ సేవలు ఉపయోగించుకోలేవు. ఫీజు ఎక్కువైనా హిండెన్‌బర్గ్ రీసెర్చిని వదలకూడదని అదానీ గ్రూప్ భావిస్తోంది.
ప్రయత్నాలు ఫలించేనా?
అయితే స్టాక్ మార్కెట్ మాయాజాలంతో ఎదిగిన అదానీ గ్రూప్ తాజా ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తన లెక్కల ఖాతా పుస్తకాలు స్వతంత్ర ఆడిటర్లు తనిఖీ చేసేందుకు అదానీ గ్రూప్ ఇప్పటికీ సిద్ధంగా లేదు. ఇది జరగనంత వరకు పెన్షన్, వెల్త్ ఫండ్ మేనేజర్లు అదానీ గ్రూప్ కంపెనీలను నమ్మకపోవచ్చు. ‘వాచ్‌టెల్’ ద్వారా అమెరికా కోర్టుల్లో హిండెన్‌బర్గ్‌ను ఎదుర్కోవాలంటే ఆ సంస్థ అడిగిన పత్రాలన్నీ బయటపెట్టాలి. అదే జరిగితే మరిన్ని చిక్కులు తప్పవని మార్కెట్ వర్గాల అంచనా.