Shraddha Walkar Murder case: శ్రద్ధావాకర్ ఎముకలను మిక్సీ పట్టి, పౌడర్ చేసిన అఫ్తాబ్

ABN , First Publish Date - 2023-02-07T19:05:34+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు లో కొత్త విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 6,600 పేజీలతో..

Shraddha Walkar Murder case: శ్రద్ధావాకర్ ఎముకలను మిక్సీ పట్టి, పౌడర్ చేసిన అఫ్తాబ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు (Shraddha Walkar Murder Case)లో కొత్త విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 6,600 పేజీలతో ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు సమర్పించిన ఛార్జిషీటుతో మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. శ్రద్ధావాకర్‌ను అఫ్తాబ్ హత్య చేసిన తర్వాత ఆమె ఎముకలను స్టోన్ గ్రైండర్‌‌తో పొడి చేసి దానిని దూరంగా విసిరేశాడు. చిట్టచివరిగా శ్రద్ధావాకర్ తలను మూడు నెలల తర్వాత డిస్పోజ్ చేశాడు. మే 18న శ్రద్ధను హత్య చేసిన తర్వాత జొమాటో నుంచి చికెన్ రోల్ తెప్పించుకుని తిన్నట్టు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

శ్రద్ధావాకర్, పూనావాలా గత ఏడాది మేలో ఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత ఖర్చుల విషయం, అఫ్తాబ్ గాళ్‌ఫెండ్స్ పలువురు దూబాయ్ నుంచి ఢిల్లీకి వస్తుండటం వంటి అంశాల్లో ఇద్దరూ తరచు గొడవపడేవారు. మే 18న ఇద్దరూ ముంబై వెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే, అకస్మాత్తుగా ఆ టిక్కెట్లను అఫ్తాబ్ కేన్సిల్ చేశాడు. టిక్కెట్ ఖర్చులపై ఇద్దరి మధ్యా తెలెత్తిన గొడవతో ఆవేశంలో అఫ్తాబ్ ఆమెను గొంతుపిసికి చంపాడు. ఛార్జిషీటులో పేర్కొన్న వివరాల ప్రకారం, శ్రద్ధను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాక్‌లో ప్యాక్ చేసి డిస్పో్జ్ చేయాలని అఫ్తాబ్ అనుకున్నాడు. ఒక బ్యాగ్ కూడా కొన్నాడు. అయితే, బ్యాగుతో అయితే తక్షణమే పట్టుబడే అవకాశాలున్నాయని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. చివరకు శరీర భాగాలు కత్తిరించేందుకు నిశ్చయించుకుని ఒక రంపం, సుత్రి, మూడు కత్తులు కొన్నాడు. బ్లో టార్చ్‌తో ఆమె వేళ్లు వేరుచేశాడు. 35 ముక్కలుగా మృతదేహాన్ని నరికి ఫ్రిజ్‌లో ఉంచారు. ఎవరైనా గాళ్‌ఫ్రెండ్స్ వస్తే ఫ్రిజ్‌లో నుంచి ఆ ప్యాకేజీని కిచెన్‌లో దాచిపెట్టేవాడు. శ్రద్ధావాకర్ సెల్‌ఫోన్‌ను కూడా దాచిపెట్టాడు. మే 18 తర్వాత కూడా ఆమె మొబైల్ పనిచేసినట్టు గూగుల్ డాటా వెల్లడించింది. ఆ తర్వాత మొబైల్‌, ఆమె వాడే లిప్‌స్టిక్‌ను కూడా ముంబైలో డిస్పోజ్ చేశాడు.

కాగా, శ్రద్ధ మృతదేహానికి చెందిన 20 భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, తల ఆచూకీ మాత్రం ఇంతవరకూ దొరకలేదు. గత ఏడాది చివర్లో అఫ్తాబ్‌కు పోలీగ్రాఫ్, నార్కో అనాలసిస్ పరీక్షలు జరిపినప్పుడు అతను హత్యనేరం అంగీకరించినట్టు చెబుతున్నారు. జరిగిన దానికి పశ్చాత్తాప పడుతున్నట్టు అఫ్తాబ్ పేర్కొనడాన్ని ఛార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. అయితే అఫ్తాబ్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు చెబుతున్న విషయాలు కోర్టుకు సాక్షంగా పనికిరావు. ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు మెజిస్ట్రేట్ ముందు చెప్పిన వాంగ్మూలాన్నే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఢిల్లీ పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్‌ నివేదికతో సహా కట్టుదిట్టమైన ఆధారాలు సేకరిస్తూ కేసు పక్కాగా ఉండేలా పావులు కదుపుతున్నారు.

Updated Date - 2023-02-07T19:14:01+05:30 IST