ఐరిస్‌తో ఆధార్
ABN , First Publish Date - 2023-12-10T03:15:23+05:30 IST
ఎవరికైనా చేతివేళ్లు లేకపోయినా, అరిగిపోయి వేలిముద్రలు పడకపోయినా ఐరిస్ (కంటిపాప) ద్వారా ఆధార్ నంబరు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
వేళ్లు లేని, వేలిముద్రలు పడనివారు పొందవచ్చు
ఆధార్ సేవా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
కేరళ మహిళ విషయంలో స్పందించిన మంత్రి
న్యూఢిల్లీ, డిసెంబరు 9: ఎవరికైనా చేతివేళ్లు లేకపోయినా, అరిగిపోయి వేలిముద్రలు పడకపోయినా ఐరిస్ (కంటిపాప) ద్వారా ఆధార్ నంబరు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేరళకు చెందిన జోసీమోల్ పీ జోస్ అనే మహిళకు చేతివేళ్లు లేకపోవడంతో ఆధార్ రాలేదు. ఈ విషయం తెలిసి కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)కు చెందిన బృందం కొట్టాయం జిల్లా కుమరకంలోని ఆమె ఇంటికి వెళ్లింది. అదే రోజు ఆమెకు ఆధార్ కార్డు వచ్చేలా చూసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. అన్ని ఆధార్ సేవా కేంద్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరికైనా వేలిముద్రలు, ఐరిస్ రెండూ నమోదు చేయడం సాధ్యం కాకపోతే ఆ విషయాన్ని ఎన్‌రోల్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌లో ప్రస్తావించాలని, దీన్ని సూచించేలా మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు ఆ వ్యక్తుల ఫొటో తీయాలని వివరించింది. వారి పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వివరాలు, లభ్యమయ్యే ఇతర బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలని పేర్కొంది. జోస్ మొదటిసారి నమోదు చేసుకున్నప్పుడు ఆధార్ ఎందుకు రాలేదన్న విషయంపై కూడా యూఐడీఏఐ బృందం ఆరా తీసింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఆపరేటర్ ఆమె వివరాల నమోదులో నిర్దేశిత ప్రొసీజర్ అనుసరించలేదని గుర్తించింది. రోజూ సుమారు వెయ్యి మంది బయోమెట్రిక్స్ మినహాయింపునకు అర్హులైన వ్యక్తుల పేర్లను యూఐడీఏఐ నమోదు చేస్తుంటుందని ఆ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు వేళ్లు లేని, వేలిముద్రలు, ఐరిస్, రెండూ పడని 29 లక్షల మందికి యూఐడీఏఐ ఆధార్ నంబర్లు జారీ చేసిందని పేర్కొంది.