మిలిటెంట్ల విడుదలకు ముట్టడి సైన్యాన్ని చుట్టుముట్టిన 1500 మంది మహిళలు

ABN , First Publish Date - 2023-06-26T01:24:24+05:30 IST

ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దాదాపు 1500 మంది మహిళలు మిలిటెంట్ల విడుదల కోరుతూ భారత సైన్యాన్ని రోజంతా చుట్టుముట్టారు. దీంతో ఆ మిలిటెంట్లను విడుదల చేసింది. మణిపూర్‌లోని

మిలిటెంట్ల విడుదలకు ముట్టడి  సైన్యాన్ని చుట్టుముట్టిన 1500 మంది మహిళలు

రోజంతా అడ్డు నిలిచిన వైనం

మణిపూర్‌ రాష్ట్రంలో ఘటన

హింస నివారించేందుకు మిలిటెంట్లను విడుదల చేసిన సైన్యం

ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదనే ఈ నిర్ణయమని వెల్లడి

ఇంఫాల్‌, జూన్‌ 25: ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దాదాపు 1500 మంది మహిళలు మిలిటెంట్ల విడుదల కోరుతూ భారత సైన్యాన్ని రోజంతా చుట్టుముట్టారు. దీంతో ఆ మిలిటెంట్లను విడుదల చేసింది. మణిపూర్‌లోని ఇథం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బల ప్రయోగం చేయడం వల్ల ప్రాణనష్టంతోపాటు పలువురు గాయపడే ప్రమాదం ఉందని, మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైన్యం తెలిపింది. ‘కాంగ్లెయ్‌ యావొల్‌ కన్న లుప్‌’ అనే మెయిటీ మిలిటెంట్‌ గ్రూప్‌నకు చెందిన ఈ 12 మంది మిలిటెంట్లను సైన్యం శనివారం ఇథం గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో, 1500 మంది మహిళలు సైన్యాన్ని చుట్టుముట్టారు. సైన్యానికి పట్టుబడిన మిలిటెంట్లలో తనకు తాను లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ప్రకటించుకున్న మొయిరాంగ్తెమ్‌ తంబా అలియాస్‌ ఉత్తమ్‌ ఉన్నాడు. ఇతడిని ‘వాంటెడ్‌ టెర్రరి్‌స్ట’గా ప్రకటించారు. ఈ మిలిటెంట్ల గ్రూప్‌ మయన్మార్‌ నుంచి భారత్‌లోకి చొరబడిందని సైనిక వర్గాల సమాచారం.

శాంతి స్థాపనకు మళ్లీ చర్చలు: బీరేన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 25: మణిపూర్‌లో అన్ని వర్గాలతో మరోసారి చర్చలు జరిపి కల్లోల పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని సీఎం బీరేన్‌సింగ్‌ చెప్పారు. కుకీలు కూడా తమవారేనని, వారితోనూ సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ఆందోళనలో పాల్గొంటున్న మహిళా విభాగమైన మెయిరా పయ్‌బిస్‌, ఇతర పౌర సంఘాలతోపాటు ప్రతి ఒక్కరికీ చేరువవుతామని తెలిపారు. ఆయన ఆదివారం ఆ రాష్ట్ర నాయకులతో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. తాను ఏ వర్గం వైపు మొగ్గు చూపడం లేదని చెప్పారు. ఇంటర్నెట్‌ పునరుద్ధరణకు ఇంకా సమయం ఆసన్నం కాలేదని చెప్పారు.

Updated Date - 2023-06-26T01:24:24+05:30 IST