Share News

కూలీల విముక్తికి చతుర్ముఖ వ్యూహం!

ABN , First Publish Date - 2023-11-20T00:34:25+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సొరంగం కూలి శిథిలాల కింద చిక్కుకుపోయిన 41 మంది కూలీల ప్రాణాలను రక్షించటానికి ఏకకాలంలో నాలుగు రకాల వ్యూహాన్ని అమలుపరచాలని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న

కూలీల విముక్తికి చతుర్ముఖ వ్యూహం!

ఉత్తరకాశీ, నవంబరు 19: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సొరంగం కూలి శిథిలాల కింద చిక్కుకుపోయిన 41 మంది కూలీల ప్రాణాలను రక్షించటానికి ఏకకాలంలో నాలుగు రకాల వ్యూహాన్ని అమలుపరచాలని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నిర్ణయించింది. ఈ మేరకు, నాలుగు వైపుల నుంచి డ్రిల్లింగ్‌ చేసుకుంటూ వెళ్లాలని అధికారులు తీర్మానించారు. ఒక్కో సంస్థకు ఒక్కో పని అప్పగించారు. హైడ్రో ఎలక్ట్రిక్‌ కంపెనీ ఎస్‌జేవీఎన్‌.. సొరంగానికి 120 మీటర్ల ఎత్తు పైనుంచి ఒక మీటరు వ్యాసంతో కిందికి తవ్వకాలు జరుపనుంది. సొరంగం కూలి పేరుకుపోయిన శిథిలాల నుంచి సమాంతరంగా 60 మీటర్ల పొడవైన మార్గాన్ని నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ వేయనుంది. దీనికి పూర్తిగా వ్యతిరేక దిశ నుంచి 400 మీటర్ల పొడవైన మార్గాన్ని వేసే పనిని తెహ్రీ హైడ్రో డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చేపట్టనుంది. శిథిలాల నుంచే కుడివైపుగా సొరంగాన్ని తవ్వకుంటూ వెళ్లే పనిని ఓఎన్‌జీసీ నిర్వహించనుంది. సహాయక చర్యలను కేంద్ర మంత్రి గడ్కరీ, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌తో కలిసి సమీక్షించారు. కూలీలకు ఒక పైపులైన్‌ ద్వారా ఆక్సిజన్‌, విద్యుత్తు, ఆహారం, నీరు, ఔషధాలను అందజేస్తున్నామని.. వారికి సురక్షితంగా బయటకు తీసుకురావటానికి మరో 2-3 రోజులు పట్టవచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-20T00:34:26+05:30 IST