Share News

బందీలపై పేలిన తూటా

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:39 AM

గాజాలో హమాస్‌ ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో శనివారం ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన కాల్పుల్లో ఆ దేశ పౌరులు ముగ్గురు చనిపోయారు. హమాస్‌ దగ్గర బందీలుగా ఉన్న

బందీలపై పేలిన తూటా

స్వదేశీయులపై పొరపాటున ఇజ్రాయెల్‌

సైన్యం కాల్పులు.. ముగ్గురి మృతి

రమల్లా, డిసెంబరు 16: గాజాలో హమాస్‌ ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో శనివారం ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన కాల్పుల్లో ఆ దేశ పౌరులు ముగ్గురు చనిపోయారు. హమాస్‌ దగ్గర బందీలుగా ఉన్న యోటమ్‌ హైమ్‌, సమేర్‌ తలాల్క, అలన్‌ షమ్రిజ్‌ ఐడీఎఫ్‌ దాడుల్లో మృతిచెందారు. వీరిని అక్టోబరు 7న హమాస్‌ వేర్వేరుచోట్ల ఉన్న కిబుట్జ్‌ల నుంచి కిడ్నాప్‌ చేసింది. అయితే, ఉగ్రవాదులతో భీకరం పోరాటంలో ఉండగా, ఈ ముగ్గురినీ ముప్పుగా భావించామని, ఆ క్రమంలో పొరపాటున జరిపిన కాల్పుల్లో మృతిచెందారని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ఘటనపై పూర్తి పారదర్శకంగా విచారణ జరిపిస్తామని తెలిపింది. కాగా, ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రాజధాని టెల్‌ అవీవ్‌లోని సెంట్రల్‌ మిలటరీ బేస్‌ ఎదుట వేలాది మంది గుమిగూడి.. తక్షణమే సంధికి ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు. ఇజ్రాయెలీల మృతి భరించలేని విషాదమని ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల్లో శనివారం 25 మంది పౌరులు మృతిచెందారని పాలస్తీనా మీడియా పేర్కొంది. ఓల్డ్‌ గాజాలోని జబాలియాలో ఉన్న ఇళ్లపై జరిపిన దాడిలో వీరంతా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

Updated Date - Dec 17 , 2023 | 06:46 AM