కారుడ్రైవర్‌ ఖాతాలోకి రూ.9 వేలకోట్లు

ABN , First Publish Date - 2023-09-22T02:53:44+05:30 IST

ఓ కారు డ్రైవర్‌ బ్యాంకు ఖాతాలోకి రూ.9 వేల కోట్లు వచ్చి పడ్డాయి. అయితే జరిగిన తప్పిదాన్ని గ్రహించిన బ్యాంకు అధికారులు.. అతనిని బుజ్జగించి, బతిమాలి అతని ఖాతా నుంచి తిరిగి ఆ డబ్బును

కారుడ్రైవర్‌ ఖాతాలోకి రూ.9 వేలకోట్లు

బుజ్జగించి వెనక్కి తీసుకున్న బ్యాంకు అధికారులు

చెన్నై, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఓ కారు డ్రైవర్‌ బ్యాంకు ఖాతాలోకి రూ.9 వేల కోట్లు వచ్చి పడ్డాయి. అయితే జరిగిన తప్పిదాన్ని గ్రహించిన బ్యాంకు అధికారులు.. అతనిని బుజ్జగించి, బతిమాలి అతని ఖాతా నుంచి తిరిగి ఆ డబ్బును తీసేసుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా వున్నాయి. దిండుగల్‌ జిల్లా నేయకారపట్టికి చెందిన రాజ్‌కుమార్‌ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన రాజ్‌కుమార్‌ బ్యాంక్‌ ఖాతాలో ‘తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌’ (టీఎంబీ) నుంచి రూ.9 వేల కోట్లు జమ అయినట్లు అతని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. ఇది నిజమో, కాదో తెలుసుకునేందుకు అతను తన స్నేహితుడి ఖాతాకు రూ.21 వేలు బదిలీ చేశాడు. రెండురోజుల తరువాత పొరపాటు జరిగిందంటూ టీఎంబీ టీ నగర్‌ శాఖ అధికారులు.. రాజ్‌కుమార్‌ను సంప్రదించారు. ఆ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవద్దని ఫోన్‌లోనే సూచించారు. అనంతరం పోలీసులు, న్యాయవాదులతో కలిసి రాజ్‌కుమార్‌ వద్దకు వచ్చిన బ్యాంకు అధికారులు.. జరిగిన పొరపాటును వివరించారు. ఆ డబ్బును వెనక్కి తీసేసుకునేందుకు సహకరించాలని కోరారు. అంతేగాక స్నేహితుడికి బదిలీ చేసిన రూ.21 వేలను తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, వాహనం కొనుగోలు కోసం రుణసాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. దీంతో రాజ్‌కుమార్‌.. బ్యాంకు అధికారులు చెప్పినట్లు సంతకాలు చేసి ఆ డబ్బును తిరిగి తీసుకునేందుకు ఆమోదం తెలిపారు.

Updated Date - 2023-09-22T02:53:44+05:30 IST