Vande Bharat: వేగం, ప్రగతి చెట్టపట్టాల్‌!

ABN , First Publish Date - 2023-09-25T02:52:24+05:30 IST

ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన, వాటి వేగం 140కోట్ల మంది భారతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఆదివారం ఆయన 11 రాష్ట్రాల గుండా ప్రయాణించే 9 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు.

Vande Bharat: వేగం, ప్రగతి   చెట్టపట్టాల్‌!

మరో 9 వందేభారత్‌లు

11 రాష్ట్రాల గుండా ప్రయాణం

ప్రారంభించిన ప్రధాని మోదీ

యశ్వంత్‌పూర్‌కు ‘వందే భారత్‌’

రాష్ట్రంలో మూడో ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

‘వందే’తో పురోగతి శకం: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ/విజయవాడ, సెప్టెంబరు 24: ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన, వాటి వేగం 140కోట్ల మంది భారతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఆదివారం ఆయన 11 రాష్ట్రాల గుండా ప్రయాణించే 9 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వేల ఆధునికీకరణపై గత ప్రభుత్వాలు దృష్టిపెట్టలేదని మోదీ విమర్శించారు. వందేభారత్‌ రైళ్లకు ఆదరణ బాగా పెరుగుతోందని.. ఇప్పటికి 1.11 కోట్ల మంది ప్రయాణికులు వాటిలో ప్రయాణించారని తెలిపారు. ప్రస్తుతం 25 వందేభారత్‌ రైళ్లు నడుస్తుండగా.. ఇప్పుడు మరో 9 అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ రైళ్లు దేశం మొత్తాన్నీ అనుసంధానించే రోజుఎంతో దూరంలో లేదన్నారు.

ఆధునిక వసతులతో కొత్త వందేభారత్‌లు

ఇప్పటివరకు నడుస్తున్న వందేభారత్‌ రైళ్లలో సదుపాయాల కొరతకు సంబంధించి ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న రైల్వే శాఖ.. కొత్తగా ప్రవేశపెట్టిన 9 రైళ్లలో అధునాతన సౌకర్యాలు కల్పించింది. సీట్లు సౌకర్యవంతంగా 19.37 డిగ్రీల వరకు వెనక్కి వాలి ఉండడం.. మరిం త మెత్తటి కుషన్లు, టాయ్‌లెట్లలో మరింత లోతుగా వాష్‌ బేసిన్లు, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ బోగీలో సీట్ల రంగు ఎరుపు నుంచి నీలం రంగుకు మార్పు, వాటికి మేగజైన్‌ బ్యాగులు, సీట్ల కింద మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్ల మెరుగుదల, టాయ్‌లెట్లలో 2.5 వాట్ల దీపాలు వంటి వసతులు కొత్తగా కల్పించారు.

విజయవాడ-చెన్నై వందేభారత్‌ రైలు ప్రారంభం

విజయవాడ-చెన్నై వందేభారత్‌ సూపర్‌ ఎక్స్‌ ప్రె్‌సను ప్రధాని ఆదివారం వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌, విజయవాడ ఎంపీ కేశినేని నాని, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ నరేంద్ర పాటిల్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. మంత్రి భారతి మాట్లాడుతూ.. స్వదేశీ సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ రైలులో ఇప్పటికి కోటి మంది ప్రయాణించారని.. ఈ రైలు దేశానికి గర్వకారణమని తెలిపారు.

9 రైళ్ల మార్గాలివే..

ఉదయ్‌పూర్‌-జైపూర్‌ (రాజస్థాన్‌), తిరునల్వేలి-మదురై-చెన్నై (తమిళనాడు), హైదరాబాద్‌-బెంగళూరు (తెలంగాణ, కర్ణాటక), విజయవాడ-చెన్నై (వయా రేణిగుంట-ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు), పట్నా-హౌరా (బిహార్‌, బెంగాల్‌), రాంచీ-హౌరా (జార్ఖండ్‌, బెంగాల్‌), కాసరగోడ్‌-తిరువనంతపురం (కేరళ), రూర్కెలా-భువనేశ్వర్‌-పూరి (ఒడిసా), జామ్‌నగర్‌-అహ్మదాబాద్‌ (గుజరాత్‌). ఇందులో కాసరగోడ్‌-తిరువనంతపురం రైలు ఆరంజ్‌ రంగు లో ఉంటుంది. దీనికి అత్యధిక డిమాండ్‌ ఉండడం గమనార్హం.

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ మధ్య పరుగు

బర్కత్‌పుర/హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు తీసింది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌(20703) మధ్య నడిచే ఈ రైలును ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ రైలును ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటికే 2వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సలు నడుస్తుండగా తాజాగా మరో రైలుమొదలైంది.

రైల్వేకు ప్రాధాన్యం పెంచాం: కిషన్‌రెడ్డి

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రవేశంతో రవాణా రంగంలో పురోగతి శకం ఆరంభమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగానికి ప్రాధాన్యం పెంచిందని పేర్కొన్నారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ రైలు ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. తెలంగాణలో రూ.6,418 కోట్లతో రైల్వే లైన్లు, స్టేషన్ల అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సతో 8.30 గంటల్లోనే బెంగళూరు చేరుకోవచ్చని తెలిపారు.

Updated Date - 2023-09-25T02:52:24+05:30 IST