Odisha Train Accident : కోరమాండల్‌ రైలు ప్రమాదంలో 50 మంది మృతి.. 179 మంది పరిస్థితి విషమం..!

ABN , First Publish Date - 2023-06-02T23:02:27+05:30 IST

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident) జరిగింది. స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ (Coromandel Express) ఢీ కొన్నది. దీంతో ఒక్కసారిగా రైలు పట్టాలి తప్పి 13 బోగీలు పల్టీలు కొట్టాయి. .

Odisha Train Accident : కోరమాండల్‌ రైలు ప్రమాదంలో 50 మంది మృతి.. 179 మంది పరిస్థితి విషమం..!

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident) జరిగింది. స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ (Coromandel Express) ఢీ కొన్నది. దీంతో ఒక్కసారిగా రైలు పట్టాలి తప్పి 13 బోగీలు పల్టీలు కొట్టాయి. ప్రమాదంలో ట్రాక్‌పై పడివున్న కోరమాండల్ రైలును మరో ప్యాసింజర్ ట్రైన్ ఢీకొన్నది. మరోవైపు.. ఈ ప్రమాదం జరిగిన కాసేపటికి పక్క ట్రాక్‌పై వస్తోన్న యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు కోరమాండల్‌ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలులో కూడా నాలుగు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో సుమారు 50 మంది దాకా చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. అయితే మరణాలపై ప్రభుత్వం నుంచి, రైల్వే శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Odisha-Train-Accident.jpg

179 మంది పరిస్థితి విషమం..!

దాదాపు 350 మందికి పైగా గాయాలవ్వగా.. ఇందులో 179 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలేశ్వర్‌ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా బహనాగ ప్రాంతంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణీకులను బయటికి తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే రాత్రి కావడంతో సహాయక చర్యలు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. సుమారు 50 అంబులెన్సులకు పైగా ఘటనాస్థలానికి వెళ్లి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంతో పలు రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా ప్రమాద సమయంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయంపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే.. ప్రమాదం జరిగిన రైల్లో బాలాషోర్ ఎమ్మెల్యే ఉన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

విషాదకరం..

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాదం దురదృష్టకర ఘటన అని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సహాయక చర్యలు సమీక్షిస్తున్నామని.. శనివారం ఉదయం ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితి సమీక్షిస్తామన్నారు. మరోవైపు ప్రమాదంపై ఒడిశా సీఎంతో తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద స్థలికి తమిళనాడు రవాణ మంత్రి, అధికారులు బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే.. సహాయక చర్యల కోసం వైమానిక దళం రంగంలోకి దిగింది. కోల్‌కతా నుంచి సహాయక చర్యలు పంపించామని రైల్వే మంత్రి మీడియాకు వెల్లడించారు. ప్రమాదంతో 3 రైళ్లు రద్దు చేస్తున్నామని, 4 రైళ్లు దారిమళ్లిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

ఎక్స్‌గ్రేషియా ప్రకటన :-

  • రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు : రూ.10 లక్షలు

  • ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి : రూ. 2 లక్షలు

  • స్వల్ప గాయాలైన వారికి 50వేల రూపాయిలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయండి..

Helpline.jpg

Updated Date - 2023-06-02T23:02:27+05:30 IST