2002 గుజరాత్ అల్లర్లు వీహెచ్‌పీ ప్రణాళికే!
ABN , First Publish Date - 2023-01-29T02:52:49+05:30 IST
గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల వెనక విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఉందని బ్రిటిష్ సర్కారు అప్పట్లోనే ఓ నివేదికను రూపొందించినట్లు తాజాగా వెల్లడైంది. ఆ
- అప్పట్లోనే బ్రిటన్ నివేదిక.. బీబీసీ డాక్యుమెంటరీలో వివరాలు
లండన్, జనవరి 28: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల వెనక విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఉందని బ్రిటిష్ సర్కారు అప్పట్లోనే ఓ నివేదికను రూపొందించినట్లు తాజాగా వెల్లడైంది. ఆ ఘటనకు కొన్ని నెలల ముందే వీహెచ్‌పీ ప్రణాళికలను సిద్ధం చేసిందని, 2002 ఫిబ్రవరి 27న గోద్రాలో కరసేవకుల రైలు దహనం అల్లర్లకు ఊతమిచ్చిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఒకవేళ గోద్రా ఘటన జరగకపోయినా..కొన్నాళ్లకు ముస్లింలే టార్గెట్‌గా వీహెచ్‌పీ తన ప్రణాళికను అమలు చేసేదని.. ఇందుకోసం ముస్లింల గృహాలు, వ్యాపార సముదాయాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఓ కంప్యూటరైజ్డ్ జాబితాను రూపొందించిందని పేర్కొంది. బ్రిటిష్ సర్కారు నివేదికను బీబీసీ ఇటీవల ప్రసారం చేసిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీల్లో ఉటంకించింది. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ.. వీహెచ్‌పీకి దన్నుగా ఉన్నారని పేర్కొంటూ బ్రిటిష్ సర్కారు 15 అంశాలతో కూడిన నివేదికను రూపొందించింది. ‘‘గుజరాత్ అల్లర్లలో పోలీసుల ప్రమేయం కూడా ఉంది. మరణాల సంఖ్య అధికారికంగా 840గా ఉన్నా.. అనధికారికంగా 2 వేల దాకా ఉంటుంది. 1.38 లక్షల మంది ముస్లింలపై ఈ అల్లర్ల ప్రభావం పడింది. హిందువులు అధికంగా నివసించే ప్రాంతాల నుంచి ముస్లింలను తరిమివేయాలన్నదే వీహెచ్‌పీ ప్రణాళిక. గ్రామీణ ప్రాంతాల్లో ఈ దమనకాండ ఒకట్రెండు నెలల వరకు అడపాదడపా కొనసాగింది. ఈ హింసలో ఐదుగురు మంత్రులు పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు’’ అని బ్రిటిష్ సర్కారు నివేదిక పేర్కొంటోంది. నష్ట పరిహారం విషయంలోనూ.. గోద్రా రైలు దహనం బాధితుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, అల్లర్ల బాధితుల విషయంలో హిందువులకు రూ.లక్ష, ముస్లింలకు రూ.50 వేలు అందించారని ఆ నివేదిక స్పష్టం చేసింది.