2 Thousand Note Cancel: 2 వేల నోటుకు బై
ABN , First Publish Date - 2023-05-20T02:09:26+05:30 IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. 2016లో నోట్ల రద్దు దరిమిలా చలామణీలోకి తెచ్చిన రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.
పెద్ద నోటును ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటన
కానీ సెప్టెంబరు 30 దాకా చలామణీలోనే!
అప్పటిదాకా ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు, మార్చుకోవచ్చు
ఒకసారికి 20 వేల రూపాయలకు మించకుండా బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు మార్చుకునే చాన్స్
డిపాజిట్లు మాత్రం నిబంధనల మేర చేసుకోవచ్చు
2వేల నోట్ల జారీ ఆపాలని బ్యాంకులకు ఆదేశం
2016లో రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన మోదీ
ఈసారి సొంత ప్రకటనతో సరిపెట్టిన ఆర్బీఐ
న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. 2016లో నోట్ల రద్దు దరిమిలా చలామణీలోకి తెచ్చిన రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. రూ.2 వేల నోట్లు ఇవ్వడం తక్షణం ఆపేయాలని అన్ని బ్యాంకులనూ ఆదేశించింది. అయితే.. నిర్ణీత కాలపరిధిలో రూ. 2000 కరెన్సీ ఉపయోగంలో లేకుండా చేసేందుకు, ఎవరి వద్దనైనా ఈ నోట్లు ఉంటే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి/మార్చుకోవడానికి తగినంత సమయం ఉండేందుకు వీలుగా.. సెప్టెంబరు 30 దాకా ఈ నోట్లు చలామణీలో ఉంటాయని స్పష్టం చేసింది.
బ్యాంకుల్లో రద్దీ పెరిగి రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకుగాను.. మంగళవారం (మే 23) నుంచి సెప్టెంబరు 30 దాకా ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను రూ.20 వేల పరిమితికి మించకుండా మార్చుకోవచ్చని వెల్లడించింది. డిపాజిట్లు మాత్రం నిబంధనల ప్రకారం చేసుకోవచ్చని పేర్కొంది. ‘‘2016 నవంబరులో అప్పటికి చలామణీలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో.. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ కరెన్సీలోటును వేగంగా పూరించడానికి ఆర్బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 24(1) కింద రూ.2 వేల నోటును ప్రవేశపెట్టాం. అనంతరకాలంలో ఇతర డినామినేషన్లలో నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి రావడంతో.. రూ.2 వేల నోటును ప్రవేశపెట్టిన ప్రయోజనం నెరవేరింది. ఫలితంగా 2018–19 నుంచి ఆ నోట్ల ముద్రణను నిలిపివేశాం.
2017 మార్చికి ముందు విడుదల చేసిన రూ.2 వేల నోట్లలో దాదాపు 89 శాతం నోట్ల జీవితకాలం (4–5 ఏళ్లు) ముగిసిపోయే దశ వచ్చింది. 2018, మార్చి 31 నాటికి పతాకస్థాయిలో రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణీలో ఉండగా.. 2023 మార్చి 31 నాటికి ఆ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గిపోయింది. ఇప్పటిదాకా చలామణీలోకి తెచ్చిన మొత్తం రూ.2 వేల నోట్ల విలువలో ఇది కేవలం 10.8 శాతం. దీనికితోడు.. ఈ నోట్లను సాధారణ లావాదేవీలకు ఉపయోగించట్లేదని మా దృష్టికి వచ్చింది. అందుబాటులో ఉన్న ఇతర డినామినేషన్ల నోట్లు ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. మా (ఆర్బీఐ) ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించాలని నిర్ణయించాం. అయితే.. ఈనోట్లు చలామణీలో ఉంటాయి. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయొచ్చు (లేదా) ఏ బ్యాంకు శాఖలోనైనా ఇతర డినామినేషన్ నోట్లతో వాటిని మార్చుకోవచ్చు. గతంలో.. 2013–14లో కూడా ఆర్బీఐ ఇదే పద్ధతిలో నోట్లను ఉపసంహరించుకున్న విషయాన్ని గమనించాలి.’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో వివరంగా పేర్కొంది.
నాడు మోదీ ప్రకటన..
2016 నవంబర్ లో రూ. 1000, రూ.500 బ్యాంకు నోట్లను రద్దు చేసి రూ. 2000 నోటును ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రజల ముందుకు వచ్చి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఆర్బీఐ ద్వారా ఈ ప్రకటన చేయించారు. అంతేకాదు, మార్పిడికి సెప్టెంబర్ 30 దాకా సమయం ఇవ్వడం ద్వారా.. ప్రజలు బ్యాంకుల ముందు క్యూలలో నిలబడనవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాక.. 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2000 నోటు ముద్రణను నిలిపివేసి, ఇతర కరెన్సీలలో తగిన మొత్తంలో డబ్బులు లభ్యమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ వర్గాలు వివరించాయి.
2016లో లాగా కాకుండా..
ఆర్బీఐ ప్రకటించిన ఈ నిర్ణయాన్ని చాలా మంది 2016 నాటి నోట్ల రద్దుతో పోలుస్తున్నారు. కానీ.. రెండింటికీ తేడా ఉంది. అప్పట్లో చలామణీలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఆర్బీఐ అనూహ్యంగా రాత్రికి రాత్రే రద్దు చేసింది. అంటే ఆ నోట్లతో ఏవీ కొనుగోలు చేయలేని పరిస్థితి. కానీ.. ఇప్పుడు రూ.2000 నోట్లు సెప్టెంబరు 30 దాకా చలామణీలో ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. అంటే రూ.2000 నోట్లతో అప్పటిదాకా లావాదేవీలు జరపొచ్చన్నమాట.