Amazon : అమెజాన్‌లో 18 వేల ఉద్యోగాల కోత!

ABN , First Publish Date - 2023-01-06T03:25:47+05:30 IST

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, సాఫ్ట్‌వేర్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ కంపెనీలు ఉద్యోగులకు చేదువార్త చెప్పాయి. భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోత పెట్టనున్నట్లు ప్రకటించాయి. అమెజాన్‌లో 18 వేల మందిని, సేల్స్‌ఫోర్స్‌లో 8 వేల

Amazon : అమెజాన్‌లో 18 వేల ఉద్యోగాల కోత!

ఇంటికి పంపేవారి వివరాలు 18 నుంచి వెల్లడి

సేల్స్‌ఫోర్స్‌ కంపెనీలో 8 వేల మందికి ఉద్వాసన

వాషింగ్టన్‌, జనవరి 5: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, సాఫ్ట్‌వేర్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ కంపెనీలు ఉద్యోగులకు చేదువార్త చెప్పాయి. భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోత పెట్టనున్నట్లు ప్రకటించాయి. అమెజాన్‌లో 18 వేల మందిని, సేల్స్‌ఫోర్స్‌లో 8 వేల మందిని ఇంటికి పంపించనున్నట్లు వెల్లడించాయి. అమెజాన్‌లో 18 వేలకు పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈవో ఆండీ జెస్సీ ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో భారీగా ఉద్యోగులను నియమించుకున్నామని, ప్రస్తుతం ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఉద్యోగాల్లో కోత పెట్టాల్సి వస్తోందని వెల్లడించారు. 10 వేల మందికి లేఆఫ్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ నవంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం 18 వేల మందిని తొలగించనున్నట్లు జెస్సీ ప్రకటించడం గమనార్హం. ఉద్యోగాలు కోల్పోయిన వారి ఇబ్బందులు తమకు తెలుసనని, వారికి అండగా ఉంటామని తెలిపారు. వారికి ప్యాకేజీలు, ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు ఉద్యోగాన్వేషణలో సహాయం అందిస్తామని వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయే వారి వివరాలను ఈ నెల 18 నుంచి వెల్లడిస్తామని జెస్సీ పేర్కొన్నారు. ఉద్యోగాల్లో కోత విషయాన్ని సంస్థలోని కొందరు వ్యక్తులు లీక్‌ చేయడం వల్లే హఠాత్తుగా ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని చెప్పారు. కరోనా సమయంలో డెలివరీలకు భారీగా డిమాండ్‌ ఏర్పడడంతో అమెజాన్‌ సంస్థ 2020, 2022 ప్రారంభ సమయాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇక సేల్స్‌ఫోర్స్‌ సంస్థ కూడా 8 వేల మంది ఉద్యోగుల (10శాతం)ను తొలగించనున్నట్లు ప్రకటించింది. 23 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఇంతటి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి దాదాపు ఐదు నెలల జీతం, ఆరోగ్య బీమా, ఇతర ప్రయోజనాలను కల్పించనున్నట్లు సేల్స్‌ఫోర్స్‌ వెల్లడించింది.

Updated Date - 2023-01-06T03:25:48+05:30 IST