Azerbaijan Armenia War: అర్మేనియాపై అజర్‌బైజాన్ ఎందుకు దాడి చేసింది.. యుద్ధానికి గల కారణాలు ఏంటి?

ABN , First Publish Date - 2023-09-19T22:53:27+05:30 IST

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఎలాగైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో.. అజర్‌బైజాన్, అర్మేనియా మధ్య కూడా ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. సోవియట్ యూనియన్ రద్దై, స్వతంత్ర దేశాలుగా మారినప్పటి నుంచే..

Azerbaijan Armenia War: అర్మేనియాపై అజర్‌బైజాన్ ఎందుకు దాడి చేసింది.. యుద్ధానికి గల కారణాలు ఏంటి?

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఎలాగైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో.. అజర్‌బైజాన్, అర్మేనియా మధ్య కూడా ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. సోవియట్ యూనియన్ రద్దై, స్వతంత్ర దేశాలుగా మారినప్పటి నుంచే.. ఈ ఇరు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. నాగోర్నో-కరాబాఖ్‌ భూభాగాల విషయంలో ఈ ఇరు దేశాలు పోట్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే అజర్‌బైజాన్ తాజాగా ఆర్మేనియాపై యుద్ధం ప్రకటించింది. మంగళవారం ఆర్మేనియా ఆక్రమిత భూభాగంలోకి తన దళాలను అజర్బైజాన్ పంపించింది. తద్వారా.. ఇరుదేశాల సైన్యాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు మరణించడంతో పాటు మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారని సమాచారం.


అసలు ఈ యుద్ధానికి గల కారణాలు ఏంటి?

అర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య 4400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాగోర్నో-కరాబాఖ్ అనే భూభాగం ఉంది. దీనిని అర్మేనియన్లు ‘ఆర్ట్‌సాఖ్’ అని పిలుస్తారు. నిజానికి.. ఇది అజర్‌బైజాన్‌లో భాగంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అయితే.. దీనిని అర్మేనియా జాతికి చెందిన సమూహాలు ఆక్రమించాయి. సుమారు 1,20,000 మంది నివాసులు అర్మేనియన్ జాతికి చెందినవారు ఉన్నారు. వీళ్లు అర్మేనియా తరహాలోనే తమకంటూ ఒక ప్రత్యేకమైన ప్రభుత్వాన్ని కలిగి ఉన్నారు. 1991లో ఈ ప్రాంత ప్రజలు అజర్‌బైజాన్ నుండి స్వతంత్రంగా ప్రకటించుకుని, అర్మేనియాలో భాగం అయ్యారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ చర్యని అజర్‌బైజాన్ పూర్తిగా తిరస్కరించింది. ఇక అప్పటినుంచే ఈ భూభాగం విషయంలో రెండు దేశాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.


గత మూడు దశాబ్దాల్లో కరాబాఖ్ ప్రాంతం విషయంలో అజర్‌బైజాన్, అర్మేనియా దేశాల మధ్య రెండు భీకర యుద్ధాలు జరిగాయి. 2020లో ఈ రెండు దేశాల మధ్య 44 రోజుల పాటు యుద్ధం సాగింది. అర్మేనియన్‌పై సైనిక చర్యను ప్రారంభించిన అజర్‌బైజాన్.. వేగంగా అర్మేనియన్ రక్షణను ఛేధించుకుంటూ దూసుకెళ్లింది. 44 రోజుల్లో ఈ యుద్ధంలో అద్భుత విజయం సాధించింది. ఏడు జిల్లాలతో పాటు నాగోర్నో-కరాబాఖ్‌లో మూడింట ఒక వంతును తిరిగి సొంతం చేసుకుంది. అజర్‌బైజాన్ విజయంలో.. టర్కీ, ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేసిన డ్రోన్ల కీలక పాత్ర పోషించాయి. అయితే.. ఈ యుద్ధంలో సైనికులతో పాటు పౌరులు కలిపి 7000 మందికి పైగా మరణించారు.

ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు చెక్ పెట్టి, శాంతి నెలకొల్పాలని గట్టిగానే ప్రయత్నాలు జరిగాయి. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, రష్యా మధ్యవర్తిత్వంతో.. అజర్‌బైజార్, అర్మేనియా మధ్య కొన్ని రౌండ్ల చర్చలు జరిగాయి. దాదాపు ఈ ఇరుదేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం తీసుకొచ్చేందుకు ఆ మూడు రాజ్యాలు ప్రయత్నించాయి. కానీ.. చివరికి ఇది అస్పష్టంగానే ఉండిపోయింది. ఇప్పుడు ఇంతలోనే మరోసారి అజర్‌బైజాన్ తన దళాలను అర్మేనియా భూభాగాల్లోకి పంపించి.. మరోసారి యుద్ధానికి బీజం వేసింది. మరి.. ఈసారి పరిణామాలు ఎక్కడిదాకా వెళ్తాయో?

Updated Date - 2023-09-19T22:53:27+05:30 IST