Dream Control Machine: అమెరికా మరో సంచలన ఆవిష్కరణ.. ఇకపై నచ్చిన కల కనేయొచ్చు
ABN , First Publish Date - 2023-12-11T17:31:24+05:30 IST
మనం నిద్రలోకి జారుకున్న తర్వాత రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని భయంకరమైనవి అయితే.. మరికొన్ని ఉల్లాసపరిచేవి ఉంటాయి. భయంకరమైన వాటిని వెంటనే మర్చిపోవాలని అనుకుంటాం కానీ.. ఉల్లాసపరిచే కలలు వచ్చినప్పుడు మాత్రం..
Halo - Dream Control Machine: మనం నిద్రలోకి జారుకున్న తర్వాత రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని భయంకరమైనవి అయితే.. మరికొన్ని ఉల్లాసపరిచేవి ఉంటాయి. భయంకరమైన వాటిని వెంటనే మర్చిపోవాలని అనుకుంటాం కానీ.. ఉల్లాసపరిచే కలలు వచ్చినప్పుడు మాత్రం ఇంకా కొనసాగింపు ఉంటే బాగుండేదని కోరుకుంటుంటాం. ఒకసారి మాత్రమే కాదు.. పదేపదే అలాంటి కలలు రావాలని నిద్రలోకి జారుకున్నప్పుడల్లా అనుకుంటాం. కానీ.. అది సాధ్యం కాదు. ఎందుకంటే.. మనల్ని కలల్ని నియంత్రిచలేం కదా! అయితే.. ఇకపై ఆ బెంగ అవసరం లేదు. ఎందుకంటే.. కలల్ని కూడా నియంత్రించే ఒక గొప్ప పరికరం త్వరలోనే అందుబాటులోకి రానుంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
ఆ పరికరం పేరు హలో. దీనిని ప్రొఫెటిక్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అల్ట్రాసౌండ్, మెషీన్ లర్నింగ్ ఆధారంగా పని చేస్తుంది. ఈ మెషిన్‌ని రాత్రి పడుకోవడానికి ముందు మన తలకు ‘కిరీటం’లా ధరించుకోవచ్చు. ఈ సాధనం.. మనం లూసిడ్ కలల దశలో ఉన్నప్పుడు వచ్చే స్వప్నాలను విశ్లేషిస్తుంది. ఇంతకీ ‘లూసిడ్ డ్రీమ్’ ఏంటని అనుకుంటున్నారా? కనురెప్పలు మూసిన తర్వాత కనుగుడ్లు వేగంగా కదిలిస్తూ నిద్రపోయే ప్రక్రియను ‘ఆర్‌ఈఎం’ దశ అని పిలుస్తారు. దీనిని లూసిడ్ డ్రీమ్ అని కూడా అంటారు. ఈ దశలో ఉన్నప్పుడు మనం ఏ తరహా కలల్ని కనాలని అనుకుంటామో.. వాటిని ఈ హలో సాధనం ప్రోగ్రామింగ్ ద్వారా ప్రవేశపెడుతుంది. ఈ విధంగా మన కలల్ని నియంత్రించుకోవచ్చని దీని రూపకర్తలు పేర్కొంటున్నారు.
ప్రజలు తమ సమయాన్ని ప్రయోజనకంగా ఉపయోగించుకోవడం కోసమే ఈ పరికరాన్ని తయారు చేసినట్లు ప్రొఫెటిక్ సంస్థ వెల్లడించింది. ఉదాహరణకు.. ఒక కంపెనీ సీఈవో మరుసటి రోజు ఓ బోర్డు మీటింగ్‌లో సెమినార్ ఇవ్వాలని అనుకుంటే, రాత్రి పడుకున్నప్పుడు నిద్రలోనే కల కంటున్నప్పుడు కసరత్తు చేసుకోవచ్చని రూకకర్తలు వివరించారు. ఈ హలో పరికరం ధర ఒక్కొక్కటి $1,500 నుంచి $2,000 మధ్య ఉంటుందని తెలుస్తోంది. వినూత్న హెడ్‌పీస్‌తో ఈ కంపెనీ స్వప్నాల మార్కెట్‌లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది.