Indian Population: జనాభాలో భారత్ నెం.1, జర్మనీ పత్రిక వివాదాస్పద కార్టూన్

ABN , First Publish Date - 2023-04-25T21:46:42+05:30 IST

భారత్‌పై జర్మనీ పత్రిక వివాదాస్పద కార్టూన్..

Indian Population: జనాభాలో భారత్ నెం.1, జర్మనీ పత్రిక వివాదాస్పద కార్టూన్

న్యూఢిల్లీ: జనాభా పరంగా భారత్ త్వరలో నెం. 1 స్థానానికి చేరుకోనుంది. అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న చైనాను వెనక్కు నెట్టి మరీ తొలి స్థానానికి చేరుకోనుంది. ఈ ఏడాది ప్రథమార్థం ముగిసేసరికి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందని ఐక్యరాజ్య సమితి ఇటీవలే ప్రకటించింది. ఈ విషయమై ఇప్పటికే చైనా స్పందించింది. జనాభా ఎంత అన్నది కాదు, నిపుణులైన వారు ఎంతమంది ఉన్నారన్నదే ముఖ్యమని చెప్పుకుపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ జర్మన్ పత్రిక జనాభా విషయంలో భారత్‌పై జాత్యాహంకార పూర్తి కార్టూన్ ప్రచురించింది.

చైనా బుల్లెట్ రైలు, సాధారణ భారతీయ రైలు పెట్టి ఈ కార్టూన్ రూపొందించింది. జనాలతో కిక్కిరిసిపోయిన భారత రైలు దూసుకుపోతుండగా చైనా వారి బుల్లెట్ రైలు వెనకబడట్టు ఆ కార్టూన్ రూపొందించింది. రైలు మీద కూడా భారతీయులు కూర్చున్నట్టు కార్టూన్ రూపొందించింది. ఈ కార్టూన్‌లో సాధారణ భారతీయ రైలును ఉపయోగించడం ద్వారా భారత్ చైనా కంటే టెక్నాలజీలో వెనకుబడి ఉందని చెప్పే ప్రయత్నం చేసింది. ఈ కార్టూన్ వైరల్ అవడంతో నెటిజన్లు మండి పడుతున్నారు. జర్మన్ పత్రిక తన జాత్యహంకారాన్ని బయటపెట్టుకుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఉదంతంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ సారథ్యంలోని ఇండియా వెనకబడిపోతుందంటూ పందెం కాయడం ఈ కాలంలో సరికాదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జర్మనీ కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-27T14:44:18+05:30 IST