Share News

Srilanka Power: అంధకారంలో శ్రీలంక.. ఆ కారణం చేత దేశవ్యాప్తంగా పవర్ కట్

ABN , First Publish Date - 2023-12-09T23:04:54+05:30 IST

ద్వీప దేశమైన శ్రీలంక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అందరికీ తెలిసిందే! ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారు కానీ.. ఆ దేశ పరిస్థితి ఇంకా దిగజారుతుందే తప్ప మెరుగుపడటం లేదు.

Srilanka Power: అంధకారంలో శ్రీలంక.. ఆ కారణం చేత దేశవ్యాప్తంగా పవర్ కట్

Sri Lanka Power Outrage: ద్వీప దేశమైన శ్రీలంక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అందరికీ తెలిసిందే! ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారు కానీ.. ఆ దేశ పరిస్థితి ఇంకా దిగజారుతుందే తప్ప మెరుగుపడటం లేదు. నిత్యవసర ధరలన్నీ ఆకాశాన్నంటడంతో.. అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో.. ఆ దేశాన్ని తాజాగా విద్యుత్ సమస్య కూడా చుట్టుముట్టింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో.. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో.. యావత్ శ్రీలంక అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిందని, ఈ సమస్యని పరిష్కరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ప్రకటించింది.


రిపోర్ట్స్ ప్రకారం.. కాట్‌మలే-బియగమా మధ్య ప్రధాన విద్యుత్‌ లైనులో సమస్య ఏర్పడిందని, ఆ కారణం చేతనే సరఫరాకు అంతరాయం కలిగిందని తెలుస్తోంది. ఒక్కసారిగా పవర్ కట్ కావడంతో.. శ్రీలంకలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. నిజానికి.. 2022 నుంచే శ్రీలంకను విద్యుత్ కోతల సమస్య వెంటాడుతోంది. విదేశీ మారక నిల్వలు తక్కువ కావడం, ఇంధన రవాణాకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో.. ఆ దేశంలో విద్యుత్ కోతలు సర్వసాధారణం అయ్యాయి. ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటి నుంచి శ్రీలంకలో రోజుకు 10 గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నారు. కానీ.. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఇలా నిలిచిపోవడం ఇదే మొదటిసారి. దీంతో.. ఆ దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకెన్నాళ్లీ కష్టాలు? తమ పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుంది? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక మీడియా వివరాల ప్రకారం.. ఈ ద్వీప దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించబడింది. మరికొన్ని గంటల్లోనే మిగిలిన ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఈబీ వెల్లడించింది. అటు.. దేశాధ్యక్షుడు కూడా వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారని సమాచారం. ఏదేమైనా.. రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితి చూస్తుంటే, శ్రీలంక ఈ సంక్షోభం నుంచి ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు.

Updated Date - 2023-12-09T23:06:42+05:30 IST