జాహ్నవికి మరణానంతరం డిగ్రీ

ABN , First Publish Date - 2023-09-16T02:36:10+05:30 IST

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులకు మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని ఆమె చదివిన నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ నిర్ణయించింది.

జాహ్నవికి మరణానంతరం డిగ్రీ

ఆమె చదివిన నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ నిర్ణయం

ఆ పోలీసు అధికారి తీరు ఆమోదయోగ్యం కాదు

ఇండియన్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుల మండిపాటు

వాషింగ్టన్‌, సెప్టెంబరు 15: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులకు మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని ఆమె చదివిన నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ నిర్ణయించింది. జాహ్నవి మృతిపై వర్సిటీ చాన్స్‌లర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులకు శిక్షపడుతుందని, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు మానసికంగా మద్దతుగా నిలవడానికి ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్లను వర్సిటీ ప్రకటించింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 23ఏళ్ల జాహ్నవి మాస్టర్స్‌ డిగ్రీ కోసం సౌత్‌ లేక్‌ యూనియన్‌లోని నార్త్‌ఈస్ట్రన్‌ వర్సిటీ క్యాంప్‌సలో 2021లో చేరారు. ఈ డిసెంబరులో ఆమె కోర్సు పూర్తి కావాల్సి ఉంది. జాహ్నవి మృతిపై సియాటెల్‌ పోలీసు శాఖ దర్యాప్తును మరింత సీరియ్‌సగా కొనసాగించాలని ఇండియన్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కోరారు. ఈ ఘటనను ఇండో అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ తీవ్రంగా ఖండించారు. జాహ్నవికి న్యాయం చేయాలని వివిధ వర్గాలకు చెందిన 200మంది స్థానికులు గురువారం సియాటెల్‌లో ర్యాలీ నిర్వహించారు.

Updated Date - 2023-09-16T02:36:10+05:30 IST